ద్రవిడ పాలన అనేది భారతదేశానికి వ్యతిరేకం ... మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు గవర్నర్

ద్రవిడ సిద్దాంతం అనేది కాలం చెల్లిన సిద్ధాంతం దాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటూ గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళులను మరోసారి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

Advertisement
Update:2023-05-06 07:04 IST
ద్రవిడ పాలన అనేది భారతదేశానికి వ్యతిరేకం ... మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు గవర్నర్
  • whatsapp icon

తమిళనాడు ప్రభుత్వంతో ప్రతిరోజూ గొడవలు పడుతున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి త‌మిళనాడు రాష్ట్రం పేరు మార్చాలంటూ వ్యాఖ్యలు చేసి పెను దుమారంసృష్టించిన విషయం తెలిసిందే. చివరకు తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి ఆయన‌ ఆ వివాదంలోంచి బైటపడ్డారు. అయినప్పటికీ ఆయన తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ద్రవిడ భాష పట్ల, ద్రవిడ సంస్కృతి పట్ల ఆయన అనేక సార్లు తన వ్యతిరేకతను బహిర్గ‌తపరుస్తూనే ఉన్నారు.

ఆయన పద్దతిపట్ల తమిళప్రజలు, ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నప్పటికీ ఆయనేమాత్రం వెనక్కి తగ్గడం లేదు, తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ''ద్రవిడ పాలన అనేది ఏక భారతం, సమైక్య భారతం అనే సిద్ధాంతానికి వ్యతిరేకం. భాషకు అంటరానితనాన్ని అంటగడుతోంది. రాష్ట్రంలో తమిళం, ఆంగ్ల భాషలు మినహా ఇతర భాషలకు అనుమతి లేదు. అలాంటి ద్రావిడ తరహా పాలనకు మద్దతివ్వలేను'' అని అన్నారు.

ద్రవిడ సిద్దాంతం అనేది కాలం చెల్లిన సిద్ధాంతం దాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటూ గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళులను మరోసారి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

ఆయన అక్కడితో ఆగలేదు. నిజానికి తాను ఈ విషయాన్ని శాసనసభలో చేసిన తన ప్ర‌సంగంలో మాట్లాడాలనుకున్నాను కానీ మాట్లాడలేదన్నారు.

గవర్నర్ వ్యాఖ్యల‌పై తమిళనాడులో తీవ్ర నిరసనలు వస్తున్నాయి. ద్రవిడ సంస్కృతిని గవర్నర్ అవమానపర్చాడంటూ ప‌లు ద్రవిడ సంఘాలు మండిపడ్డాయి. డీఎంకే కూడా గవర్నర్ పై విరుచుకపడింది.

''గవర్నర్‌కు అసలు అవగాహన లేదు, అతను రాజకీయాలు చేస్తున్నాడు. ఆయనకు భావజాలం, దాని అమలులో ఆర్థిక నమూనా మధ్య తేడా కనిపించడం లేదు.'' అని డిఎంకె మీడియా రిలేషన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జె కాన్‌స్టాంటైన్ రవీంద్రన్ అన్నారు.

“రవి ముందు చరిత్ర చదవాలి. ద్రావిడ మోడల్ అనే పదానికి రాజకీయ రంగు పులమాలని ఆయన భావిస్తున్నారు. గతంలో అనేక మంది ఆర్థికవేత్తలు ద్రవిడ సంస్కృతి గురించి మాట్లాడారు. వారెవ్వరూ డీఎంకేకు అనుకూలం కాదు. మాజీ ఐఏఎస్ అధికారి, ఒకప్పుడు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఆర్థిక సలహాదారుగా ఉన్న ఎస్ నారాయణన్ తన ద్రవిడియన్ వేస్ పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు” అని రవీంద్రన్ అన్నారు.

ఆ పుస్తకం ప్రత్యర్థి ద్రవిడ పార్టీలు డిఎంకె, ఎఐఎడిఎంకె లు రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు అధికారాన్ని అందించిన విధానాన్ని ప్రశంసించింది. "ఇది ఒక సాంఘిక సంక్షేమ ఎజెండాను అందించడానికి... వెనుకబడిన తరగతులకు ఆర్థిక, అభివృద్ధి ఎజెండాను రాష్ట్ర విధానంలో సమర్ధవంతంగా ఆవిష్కరించడంలో ఆదర్శప్రాయమైన ఉదాహరణ" అని నారాయణన్ పుస్తకంలో పేర్కొన్నారు.

దీనికి విరుద్ధంగా, రవి ద్రావిడ మోడల్‌ను గడువు ముగిసిన భావజాలం అని పిలిచాడు…కేవలం దాన్ని రాజకీయ నినాదం అని పేర్కొన్నారు. ఇది విభజనకు నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. కానీ నారాయణన్ ద్రావిడ పాలనా పద్ధతిని, ఎం కరుణానిధి, ఎంజిఆర్, జె జయలలిత వంటి నాయకులు తీసుకున్న సామాజిక ఎజెండాగా ప్రశంసించారు.

ద్రావిడ మోడల్ అంటే సమానత్వం, సామాజిక న్యాయం అని, గవర్నర్ చెప్పేది కాదని డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు. "రవి క్లెయిమ్ చేసినట్టు కాకుండా, ఉత్తర భారత రాష్ట్రాలు కూడా నేడు ద్రావిడ నమూనాను అనుసరిస్తున్నాయి." అని ఆయన అన్నారు. 

Tags:    
Advertisement

Similar News