ఈ ఐఏఎస్ అధికారి 56 వ సారి బదిలీ అయ్యారు!
తన ముక్కు సూటి తనమే తన బదిలీలకు కారణమని ఆయన అంటారు. రాజకీయ నాయకులు చెప్పినట్టు వినకపోవడం వల్ల 56 బదిలీలు చవిచూడాల్సి వచ్చింది. తన కెరీర్ లో వెనకబడి పోయినందుకు ఆయన పలు సార్లు నిరాశ వ్యక్తం చేశారు.
హర్యానాకు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరో సారి బదిలీ అయ్యారు. 30 ఏళ్ళ సుదీర్ఘ సర్వీసులో ఆయనకిది 56వ బదిలీ.
సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ చీఫ్ సెక్రటరీ అయిన ఖేమ్కా ను ఇప్పుడు ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. బదిలీకి నిర్దిష్ట కారణాలేవీ అధికారిక ప్రకటనలో పేర్కొనలేదు.
రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఖేమ్కాను రాష్ట్ర ఆర్కైవ్స్ విభాగంలో నియమించడం ఇది నాలుగోసారి.
గతంలో ఆయన ఆర్కైవ్స్ శాఖ డైరెక్టర్ జనరల్‌గా, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 2013లో హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఖేమ్కాను తొలిసారిగా ఈ శాఖకు బదిలీ చేశారు. అతన్ని చివరిసారిగా అక్టోబర్ 2021లో ఆర్కైవ్స్ శాఖ నుండి బదిలీ చేశారు. ఖేమ్కా ఫిబ్రవరి 2022లో అదనపు ప్రధాన కార్యదర్శి స్థాయికి పదోన్నతి పొందారు.
తన ముక్కు సూటి తనమే తన బదిలీలకు కారణమని ఆయన అంటారు. రాజకీయ నాయకులు చెప్పినట్టు వినకపోవడం వల్ల 56 బదిలీలు చవిచూడాల్సి వచ్చింది. తన కెరీర్ లో వెనకబడి పోయినందుకు ఆయన పలు సార్లు నిరాశ వ్యక్తం చేశారు.
అయితే ఈ బదిలీకి ముందు అశోక్ ఖేమ్కా హర్యానా చీఫ్ సెక్రటరీ సర్వేష్ కౌశల్‌కు లేఖ రాశారు. అందులో, తన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేసిన తర్వాత తనకు తగినంత పని లేదని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో వారానికి 2-3 గంటల కంటే ఎక్కువ పని లేదని అతను తన లేఖలో పేర్కొన్నారు. తన స్థాయి అధికారికి కనీసం వారానికి 40 గంటల పని ఉండాలని ఆయన సూచించారు. ఆ తర్వాతే ఈ బదిలీ జరిగింది.
ఇతనితో పాటు మరి కొందరి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినప్పటికీ ఖేమ్కా బదిలీ పైననే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 30 ఏళ్ళ సర్వీసులో 56 సార్లు..అంటే సంవత్సరానికి దాదాపు రెండు సార్లు బదిలీ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రభుత్వాల వివక్షనే ఈ అధికారి బదిలీలకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత అక్టోబర్‌లో పలువురు ఐఏఎస్ ల ప్రమోషన్ల తర్వాత, ఖేమ్కా ఓ ట్వీట్ చేసాడు అందులో, “GOIకి సెక్రటరీలుగా కొత్తగా నియమితులైన నా బ్యాచ్‌మేట్‌లకు అభినందనలు! ఇది ఆనందపడాల్సిన సందర్భం. అయితే, ఇది నాలాంటి వెనకబడి ఉన్నవారికి నిరుత్సాహాన్ని కూడా కలగజేస్తుంది. నిటారుగా ఉండే చెట్లనే ఎపూడూ మొదట నరికివేస్తారు.'' అని ట్వీట్ లో కామెంట్ చేశారు.
చట్ట ప్రకారం, తమ నిబందనలకు అనుగుణంగా, రాజకీయ నాయకుల మాటను వినకుండా పని చేసే అధికారులకు ఈ దేశంలో ఏం జరుగుతుందో అశోక్ ఖేమ్కా ఉదంతమే మంచి ఉదహరణ.