చిల్లర రాజకీయాల్లో వారు పూర్తిగా కూరుకుపోయారు
అగ్రరాజ్యంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ నేతల కుటిల మనస్తత్వాలను తెలియజేస్తున్నాయన్నకాంగ్రెస్ నేత శశిథరూర్
ప్రధాని మోడీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుంటూ భారత్‌ను అస్థిరపరచడానికి అమెరికా యత్నిస్తున్నదని బీజేపీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. అగ్రరాజ్యంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ నేతల కుటిల మనస్తత్వాలను తెలియజేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి ప్రవర్తన భారత్‌కు ఇబ్బందికరంగా మారొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీకి ప్రజాస్వామ్యం, దౌత్యం అంటే ఏమిటో అర్థం కావడం లేదని స్పష్టమౌతున్నది. చిల్లర రాజకీయాల్లో వారు పూర్తిగా కూరుకుపోయారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను విస్మరించారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించే విధంగా ప్రవర్తించడం లేదు. వారి బాధ్యతలను విస్మరిస్తున్నారు. కీలకమైన దేశాలతో బీజేపీ అనుసరిస్తున్న ఇటువంటి ప్రవర్తన భారతదేశానికి ఇబ్బందికరంగా మారవచ్చని థరూర్ పేర్కొన్నారు.
భారత్ ప్రతిష్టను దెబ్బతీయడానికి అమెరికాలోని కొన్నిశక్తులు .. 'ఓసీసీఆర్‌పీ' (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు), కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీలతో కుమ్మకయ్యాయని బీజేపీ ఇటీవల ఆరోపించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, ఆ సంస్థ ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్నదని చెప్పడానికి ఓసీసీఆర్‌పీ నివేదికలనే రాహుల్ ఉపయోగించారని తెలిపింది. ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్, రాక్ ఫెల్లర్స్ బ్రదర్స్ తదితరులతో పాటు అమెరికా విదేశాంగశాఖకు చెందిన యూఎస్‌ఏఐడీ..ఓసీసీఆర్‌పీకి నిధులు సమకూరుస్తున్నట్లు ఫ్రాన్స్ మీడియాలో వచ్చిన నివేదికలను ప్రస్తావించింది. దీనిపై తాజాగా అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. బీజేపీ నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం శోచనీయమని పేర్కొన్నది. జర్నలిస్టుల వృత్తిపరమైన సామర్థ్యాల పెంపునకు సంబంధించి శిక్షణ విషయంలో స్వతంత్ర సంస్థలతో కలిసి అమెరికా పనిచేస్తుందని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఆ సంస్థల సంపాదకీయ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని.. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు తమ దేశం మారుపేరుగా ఉందన్నారు. అధికారపార్టీ నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం నిరాశజనకమని పేర్కొన్నారు.