ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌లో పాల్గొంటున్న ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనున్నది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నది. అయితే ఇక్కడ హస్తం పార్టీ నామమాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పోటీ ఆప్, బీజేపీల మధ్యే ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చడానికి మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు. హోం ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండనున్నది. 2020 అసెంబ్లీ ఎన్నికలలో, ఢిల్లీలో 62.59 శాతం ఓటింగ్ నమోదు కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 56 శాతం ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ముగిసిన తర్వాత 6.30 గంటలకు ఎగ్జిట్‌పోల్స్ వెలువడే అవకాశం ఉన్నది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లలు పూర్తిగా ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓట్లను వేయాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు.