అసమగ్ర కులగణనపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తారా

రాహుల్‌గాంధీని ప్రశ్నించిన కేటీఆర్‌.. బహిరంగ లేఖ రాసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement
Update:2025-02-05 18:18 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన అసమగ్ర కులగణన సర్వేపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తారా అని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి బుధవారం కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది ప్రజల వివరాలు సేకరించకుండానే సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. అయినా లోక్‌సభను తప్పుదోవ పట్టించేలా తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వం కుల గణన సర్వే పూర్తి స్థాయిలో నిర్వహించిందని చెప్పడం సరికాదన్నారు. పదేళ్లక్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లుగా తేలిందని.. అప్పటి రాష్ట్ర జనాభాలో బీసీల సంఖ్య 51 శాతం అని నిర్దారణ అయ్యిందని గుర్తు చేశారు. మైనార్టీల్లోని బీసీలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం బీసీలు 61 శాతం అని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బీసీల జనాభా 1.64 కోట్లకు ఎలా తగ్గిందని, 46 శాతానికి జనాభా ఎలా పడిపోయిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో బీసీల జనాభా తగ్గినట్టుగా చూపుతోన్న ఈ సర్వేను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కూడా కాంగ్రెస్‌ పార్టీకి లేదని నిన్నటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంతో తేలిపోయిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని మండిపడ్డారు. పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని చెప్పడం రిజర్వేషన్ల అమలుపై చేతులెత్తేయడమేనని అన్నారు. ఇది మోసం చేయడం కాక ఇంకేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తమకు చేసిన ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసం తమను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమన్నారు. తెలంగాణలో అమలు చేయని పథకాలను అమలు చేస్తున్నట్టుగా ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. కులగణనలో దారుణమైన తప్పులు చేశారని.. వాటిని సవరించాల్సిన బాధ్యతను మరిచి రిజర్వేషన్ల పెంపును కేంద్రం పరిధిలోకి నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వ నివేదికను చించేసి నిరసన తెలిపారని అన్నారు. కులగణనలో తప్పులు బీసీలకు రాబోయే రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలను కోల్పోయే ప్రమాదముందన్నారు. తెలంగాణలో బీసీలను ఘోరంగా మోసం చేసిన ఫెయిల్యూర్‌ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News