స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో థరూర్ లేరుగా..! బీజేపీ శునకానందం

బీజేపీ, బీజేపీ అనుకూల మీడియా తెగ ఇదైపోతోంది. అదిగో అవమానం జరిగింది, థరూర్‌ని పక్కన పెట్టేశారు, కాంగ్రెస్‌లో అంతర్గత కల్లోలం మొదలైందంటూ వార్తలు వండివారుస్తోంది.

Advertisement
Update:2022-11-16 15:06 IST

భారత్‌లో మీడియా లేదు ఉన్నది కేవలం మోడియా మాత్రమేనంటూ ఇటీవలే చురకలంటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో శశిథరూర్‌కి చోటు లేకపోవడంపై మీడియా ఇలాగే రియాక్ట్ అవుతోంది. థరూర్‌కి అవమానం జరిగిందని, కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయని, కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తే ఇలాగే ఉంటుందని వార్తలొస్తున్నాయి. కొంతమంది బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ శునకానందం పొందడం విశేషం.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే సహా.. కీలక నేతలకు ఇందులో చోటు దక్కింది. వాస్తవానికి శశిథరూర్‌కి కూడా ఈ లిస్ట్‌లో చోటు ఉండాలి, కానీ లేదు. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. దీనిపై థరూర్ ఎక్కడా స్పందించ లేదు, అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించలేదు. కానీ బీజేపీ, బీజేపీ అనుకూల మీడియా తెగ ఇదైపోతోంది. అదిగో అవమానం జరిగింది, థరూర్‌ని పక్కన పెట్టేశారు, కాంగ్రెస్‌లో అంతర్గత కల్లోలం మొదలైందంటూ వార్తలు వండివారుస్తోంది.

గుజరాత్‌లో ప్రచారం చేసేందుకు శశిథరూర్‌ను కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఆహ్వానించింది. అయితే క్యాంపెయినర్ల లిస్ట్‌లో పేరు లేకపోవడంతో ఆయన ప్రచారానికి వస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. థరూర్ ప్రచారానికి రానని ఎక్కడా చెప్పలేదు, కానీ అంతలోనే బీజేపీ ఆయనపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ, కాంగ్రెస్‌ని టార్గెట్ చేసింది. గుజరాత్‌లో ప్రస్తుతం బీజేపీ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. వరుస విజయాలకు ఈసారి కచ్చితంగా బ్రేక్ పడుతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. కాంగ్రెస్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ అంతు చూడటానికి సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో గెలుపోటములు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయనేది బీజేపీని వేధిస్తోన్న మరో భయం. అందుకే ఇలా పక్క పార్టీల వ్యవహారాల్లో వేలుపెడుతోంది కమలదళం.

Tags:    
Advertisement

Similar News