తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం..వరుస ప్రమాదలపై రాహుల్ ఫైర్
తమిళనాడులో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారు
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578)కు ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. దాదాపు 19 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులెవరూ మరణించలేదని సదరన్ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును ఢీకొన్నప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
గతంలో గ్రీన్ సిగ్నల్స్ పడటం, రైలు ట్రాక్ మారడం వంటి తప్పిదాలు జరిగాయి. పార్సిల్ బోగిలో మంటలు చెలరేగినట్లు సౌత్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రెండు రైళ్లును రద్దు చేయగా.. మరో అరడజనుకు పైగా రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించినట్లు పేర్కొన్నారు. మైసూర్ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.‘మైసూర్ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్ ఘటనకు అద్దం పడుతోంది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా పాఠాలు నేర్వలేదు. జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలి. ఈ ఎన్డీయో సర్కార్ మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు బలి కావాలి..?’ అంటూ రాహుల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.