తమిళ రాజకీయాలు.. ఓ మల్టీస్టారర్ సినిమా!
ఎంజీఆర్ అని తమిళ ప్రజలు ముద్దుగా పిలుచుకునే మరుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ తమిళ సినీరంగంలో అసమాన తారగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు.
తమిళనాట రాజకీయాలు సినిమా రంగంతో పెనవేసుకుపోయి ఉంటాయి. ఎంతగా అంటే తమిళ రాజకీయ రంగం ఓ మల్టీస్టారర్ సినిమాలా ఉంటుంది. ఎంజీఆర్, జయలలిత నుంచి ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ వరకు అరవ రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు ఏనాడూ కొదవలేదు. రజినీకాంత్ ఒక్కరే పార్టీ పెడతారని దశాబ్దాలుగా ఊరించి చివరకు మిన్నకుండిపోయారు.
ఎంజీఆర్ టు విజయ్
ఎంజీఆర్ అని తమిళ ప్రజలు ముద్దుగా పిలుచుకునే మరుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ తమిళ సినీరంగంలో అసమాన తారగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో విభేదించి ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే) స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజీఆర్ తర్వాత ఆయన వారసురాలిగా మరో ప్రముఖ నటి జయలలిత ఇదే పార్టీలో కీలకంగా ఎదిగి సీఎం కూడా అయ్యారు.
డీఎంకేలోనూ సినిమా కళ
మరోవైపు ప్రస్తుత అధికార డీఎంకేలోనూ సినిమా కళ ఉంది. డీఎంకే కురువృద్ధుడు దివంగత కరుణానిధి ఎన్నో సినిమాలకు స్క్రీన్‌ప్లేలు రాశారు. ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ యువ కథానాయకుడిగా తమిళ సినీ రంగంలో ఉన్నారు. పార్టీ యువజన అధ్యక్షుడిగా, మంత్రిగానూ బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
విజయ్‌కాంత్, శరత్‌కుమార్, కమలహాసన్
దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) స్థాపించిన మరో సినీ హీరో కెప్టెన్ విజయ్‌కాంత్ కూడా తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. కమలహాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి పోటీ చేస్తున్నారు. మరో సినీ హీరో శరత్‌కుమార్ ఆలిండియా సమ్మత్తువ మక్కల్ కట్చి పార్టీని స్థాపించి రెండుసార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇప్పుడు వీరి సరసన విజయ్ కూడా చేరారు.