తమిళనాడు Vs తమిళగం: గవర్నర్Vs ద్రవిడనేతలు...ఏంటీ వివాదం?
అసలు తమిళనాడుకు, తమిళగం కు తేడా ఏంటి ? ఆ రెండు పదాల అర్థాలేంటి ? ఎందుకు అటు ద్రవిడనేతలు ఇటు గవర్నర్ తమ తమ వాదాల మీద దృడంగా నిలబడ్డారు ?
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య కొంత కాలంగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా గవర్నర్ రవి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని కాకుండా తాను రాసుకున్న ప్రసంగాన్ని చదవడం మరింత వివాదాన్ని రాజేసింది. అంబేద్కర్ గురించి, ద్రవిడనేతల గురించి ఉన్న ప్రసంగాన్ని చదవడానికి గవర్నర్ ఇష్టపడలేదు. పైగా తమిళనాడు రాష్ట్రం పేరు మార్చి తమిళగం గా పెట్టాలని గవర్నర్ ప్రతిపాదిస్తున్నారు. అసెంబ్లీ ప్రసంగంలో కూడా తమిళగం అని ప్రస్తావించి తమిళ శాసన సభ్యుల ఆగ్రహానికి కారణమయ్యాడు. అసెంబ్లీ ఆయన తీరుకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో ఆయన సభనుంచి వాకౌట్ చేశారు.
ఆయన అక్కడితో ఆగలేదు. మొన్న రాష్ట్రంలో రాజకీయనాయకులకు, ప్రముఖులకు పంపించిన పొంగల్ ఆహ్వాన పత్రికలో తమిళనాడు అనే పేరు బదులు తమిళగం అని రాశారు. దీంతో తమిళనాడు పేరుతో ఎంతో సెంటి మెంట్ పెనవేసుకొని ఉన్న తమిళ ప్రజలు గవర్నర్ పట్ల ఆగ్రహం గా ఉన్నారు.
అసలు తమిళనాడుకు, తమిళగం కు తేడా ఏంటి ? ఆ రెండు పదాల అర్థాలేంటి ? ఎందుకు అటు ద్రవిడనేతలు ఇటు గవర్నర్ తమ తమ వాదాల మీద దృడంగా నిలబడ్డారు ?
జనవరి 4న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో “ఇక్కడ తమిళనాడులో అంతా భిన్నంగా ఉంటుంది. దేశం మొత్తానికి వర్తించే ప్రతిదాన్ని తమిళనాడు కాదు అని చెబుతుంది. ఇది వీరికి అలవాటుగా మారింది.ఇక్కడి వాదాల గురించి చాలా థీసిస్‌లు రాశారు. అన్నీ తప్పుడు, పేలవమైన కల్పనలతో కూడుకున్నవి. సత్యం గెలవాలి. ఈ రాష్ట్రానికి తమిళనాడుకన్నా తమిళగం అనేదే సరైన పేరు. " అని గవర్నర్ రవి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ, దాని గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఎజెండాను తమిళనాడు మీద రుద్దడానికే గవర్నర్ ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తున్నారని అధికార డీఎంకే ఆరోపించింది. మరోవైపు, గవర్నర్ రవి, అధికార పార్టీ, దాని మిత్రపక్షాలు రాజకీయాల్లో తమిళ జాతివాదానికి ప్రతీక అని పేర్కొన్నారు. గవర్నర్ ద్రావిడ భావజాలంతో విభేదిస్తున్నట్లు కనిపిస్తోంది.
తమిళనాడులో "నాడు" అనే పదానికి "దేశం" ''భూమి'' అని అర్ధం. తమిళనాడు అంటే "తమిళుల దేశం" అని అర్దం. తమిళగం అంటే "తమిళ ప్రజల నివాసం".అని అర్దం.
తమిళనాడును భారతదేశంలో భాగం కాదని చూపడానికే తమిళనాడు అనే పేరు పెట్టారని గవర్నర్ భావన. తమిళనాడు దేశంలో భాగం కాదని చెప్పడానికి ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వాదన.
ఇక ద్రవిడ సిద్దాంతాలను ఆచరించే డీఎంకే వాదన మరోలా ఉంది. ''తమిళనాడు అనే పేరు మన భాష, సంప్రదాయం, రాజకీయాలు, జీవితాన్ని సూచిస్తుంది. ఈ నేల ఎప్పటికీ తమిళనాడుగానే ఉంటుంది' అని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.
డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ గవర్నర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది, ‘‘తమిళనాడు అనే పేరు సార్వభౌమ దేశానికి ప్రతీక అని గవర్నర్ అన్నారు. రాజస్థాన్ పేరు మీకు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్, లేదా తుర్క్‌మెనిస్థాన్ లాగా ఉందా? మహారాష్ట్ర వేర్పాటువాద పేరు కాదా? ఆ పేరు మరాఠాల భూమిని సూచించడం లేదా ? కేరళ పర్యాటక నినాదం, 'దేవుని సొంత దేశం', తెలుగుదేశం పార్టీలో మీకు 'దేశం పదం తో సమస్యలేదా? " అని ఆ పత్రికలో రాశారు.
డిఎంకె మొదట్లో ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేసినప్పటికీ, అప్పటి మద్రాసు రాష్ట్రానికి తమిళనాడుగా పేరు మార్చిన తర్వాత ఆ డిమాండ్‌ను విరమించుకుంది.
"తమిళనాడుగా పేరు మార్చిన తర్వాత, మేము మీతో ఉన్నాము. మాకు మరిన్ని అధికారాలు కోరుకుంటున్నాము. ప్రత్యేక దేశం అనే డిమాండ్ ముగిసిన అధ్యాయం" అని డిఎంకె అధికార ప్రతినిధి, మాజీ ఎంపి టికెఎస్ ఇలంగోవన్ అన్నారు.
పేరులోనైనా సరే దేశం అనే పదం ఉండటాన్ని అఖండభారత్, ఒకే దేశం ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే చట్టం, ఒకే భావజాలం అనే నినాదాలను నమ్ముతున్న ఆరెస్సెస్ కానీ దాని అనుబంద సంస్థలు, పార్టీలు కానీ సహించలేవు అని ద్రవిడ సంస్థల వాదన. ఫెడరల్ వ్యవస్థ పట్ల వ్యతిరేకంగా ఉండే ఆ సంస్థలు కేంద్రీకృతమైన ఏక శిలా వ్యవస్థ ఉండాలని కోరుకుంటాయి. దానికి వ్యతిరేకంగా చిన్న వాదనను కూడా అవి భరించలేవు. ఇక తమిళనాడు లాంటి ద్రవిడభావజాలాన్ని అస్సలు భరించలేవు. అందులో భాగంగానే ఇప్పుడు గవర్నర్ రవి తీసుక వచ్చిన తమిళగం అనే వివాదాన్ని చూడవచ్చు అని డీఎంకే భావిస్తోంది.
అయితే విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భావజాలాలు విలసిల్లుతున్న భారతదేశంలో తమిళనాడు గవర్నర్ రవి గానీ , వారి గురువులు కానీ కోరుకుంటున్నట్టు ప్రజలనందరినీ ఒకే ముద్దలా తయారు చేయడం అవుతుందా ? ఇది ద్రవిడ వాదుల ప్రశ్న.