సొంత పార్టీ కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి
ఆ సమయంలో సహనం కోల్పోయిన మంత్రి ఆగ్రహంతో కార్యకర్తలను దుర్భాషలాడుతూ వారిపై రాయి విసిరారు. దీంతో కార్యకర్తలు బిత్తరపోయారు.
తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన ఓ మంత్రి సహనం కోల్పోయి సొంత పార్టీ కార్యకర్తలపై రాయి విసరడం సంచలనం సృష్టిస్తోంది. కార్యకర్తల పట్ల మంత్రి వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష అన్నాడీఎంకే, ఇతర పార్టీలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.
అసలేమైందంటే.. హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారిని తలుచుకుంటూ డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో వీర వనక్కమ్ నాల్ ఈవెంట్ ను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొనాల్సి ఉంది.
ఈ ఈవెంట్ ఏర్పాట్లు మంత్రి నాసర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే సభా వేదిక, ఇతర ఏర్పాట్లు పూర్తయినప్పటికీ వేదిక వద్ద కుర్చీలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో మంత్రి నాసర్ దగ్గరుండి కుర్చీలు వేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమ నిర్వహణకు సమయం లేదని వేగంగా కుర్చీలు వేయాలని కార్యకర్తలను పరుగులు పెట్టించారు.
ఆ సమయంలో సహనం కోల్పోయిన మంత్రి ఆగ్రహంతో కార్యకర్తలను దుర్భాషలాడుతూ వారిపై రాయి విసిరారు. దీంతో కార్యకర్తలు బిత్తరపోయారు. అయితే మంత్రి కార్యకర్తలపై రాయి విసరడాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఇంత చిన్న విషయానికే కార్యకర్తలపై రాళ్ల విసరడం ఏంటని నెటిజన్లు మంత్రి నాసర్ ను విమర్శిస్తున్నారు.