లైంగిక వేధింపులకంటే బీజేపీ వేధింపులే ఎక్కువ..
ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపాయి. స్వాతి మాలీవాల్ కూడా ఆ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.
ఢిల్లీలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ ని అర్థరాత్రి ఓ కారు డ్రైవర్ వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఆమెను కారుతోపాటు 15మీటర్లు ముందుకు లాక్కెళ్లాడు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ హరీష్ చంద్రను రిమాండ్ కి తరలించారు. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపాయి. స్వాతి మాలీవాల్ కూడా ఆ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.
అదంతా డ్రామా..!!
స్వాతీ మాలీవాల్ పై దాడి జరగడం, దాన్ని రికార్డ్ చేయడం అంతా డ్రామా అని అంటున్నారు బీజేపీ నేతలు. ఆ కారు డ్రైవర్ ఆమ్ ఆద్మీ పార్టీ సానుభూతి పరుడని, కావాలనే వారు ఢిల్లీ పరువు తీసేందుకు ఇలాంటి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులను తక్కువచేసి చూపించేందుకే ఇలా నాటకాలాడారని అన్నారు. ఈ ఆరోపణలపై సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు స్వాతీ మాలీవాల్. తన గురించి అబద్ధాలు చెప్పి, భయపెట్టాలని చూసేవారికి తన జవాబు ఇదేనంటూ ట్వీట్ వేశారు. జీవితంలో తాను ఎన్నో సార్లు దాడులగు గురయ్యానని, అయినా తాను ఎక్కడా ఆగలేదని, ప్రతి దాడిలోనూ తాను మరింత రాటుదేలానని చెప్పారు. తన గళాన్ని ఎవరూ అణచివేయలేరన్నారు. తాను జీవించి ఉన్నంతకాలం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు స్వాతి.
స్వాతీ మాలీవాల్ ఢిల్లీలో ఆరోజు ఏం జరిగిందనే విషయంపై వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో స్వాతి డ్రైవర్ వైపు ఎందుకు వెళ్లి మాట్లాడారని బీజేపీకి చెందిన కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని, ఆ సమయంలో మహిళ ఒంటరిగా ఉంటే ఎవరైనా అనుమానంగానే చూస్తారని అన్నారు. బీజేపీ నేతలు చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వాతి రియాక్షన్ తో మరింతమంది నెటిజన్లు బీజేపీ నేతలపై మండిపడుతున్నారు.