మణిపూర్ డీజీపీని బోనెక్కించండి..

అసలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేది ఇలాగేనా? అని ప్రశ్నించింది. మణిపూర్‌ డీజీపీ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది సుప్రీంకోర్టు.

Advertisement
Update:2023-08-01 19:01 IST

మణిపూర్ డీజీపీని కోర్టు బోను ఎక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈనెల 7వతేదీకి మణిపూర్ అల్లర్ల కేసు విచారణ వాయిదా వేసింది. పోలీసుల తీరు, ఎఫ్ఐఆర్ ల నమోదులో నిర్లక్ష్యంపై.. సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం, మంగళవారం కూడా అదే మోతాదులో తలంటింది. వేలకొద్దీ ఎఫ్‌ఐఆర్‌ లు నమోదైనప్పటికీ.. అరెస్ట్‌లు జరగలేదని, విచారణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని వ్యాఖ్యానించింది. అసలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేది ఇలాగేనా? అని ప్రశ్నించింది. మణిపూర్‌ డీజీపీ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.

మణిపూర్‌లో శాంతి భద్రతల మాటే లేదని, రాష్ట్ర యంత్రాగం పూర్తిగా విఫలమైందని, హింస చెలరేగి మూడు నెలలైనా నిందితుల్ని గుర్తించలేకపోతున్నారని, ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. విచారణలో అడుగడుగునా నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మే నుండి జులై చివరి వరకు రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విచారణ సందర్భంగా సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరు బాధితుడు, ఎవరు నేరస్తుడు అనేది కోర్టుకి అనవసరం అని.. నేరం ఎవరు చేసినా కోర్టు తీరు ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు సీజేఐ డీవై చంద్రచూడ్. రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితుల్లో లేరు కాబట్టి, దీనికి ఓ ప్రత్యేక యంత్రాంగం అవసరమని చెప్పారు. ప్రభుత్వ పనితీరుని పరిశీలించడం, పరిహారం, పునరుద్దరణ పనులు, దర్యాప్తు స్వతంత్రంగా జరిగేలా చూడడం, స్టేట్‌ మెంట్లు నమోదు చేయడం.. ఇలా అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది. మణిపూర్ లో బాధితులకు సరైన సాయం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మణిపూర్ లో పాఠశాలలు, అందులో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందని, ప్రజలకు వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీసింది. 

Tags:    
Advertisement

Similar News