క్యాన్సిల్‌ చేయడం అంత సులువు కాదు.. - నీట్‌ ప్రవేశ పరీక్ష రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు

సమాధానం కావాలంటూ ఎన్‌టీఏకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సెలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Advertisement
Update:2024-06-11 21:07 IST

నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి నోటీసులు జారీ చేసింది. జస్టిన్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ అమానుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్లు చేసిన ఆరోపణలపై తమకు సమాధానాలు కావాలని ధర్మాసనం పేర్కొంది.

ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్లనుద్దేశించి స్పందిస్తూ.. పరీక్షను క్యాన్సిల్‌ చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడింది. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయని పేర్కొంది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ – 2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

దీనిపై సమాధానం కావాలంటూ ఎన్‌టీఏకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సెలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది మే 5వ తేదీన నీట్‌ యూజీ –2024 ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. జూన్‌ 4న ఫలితాలను ప్రకటించారు. అయితే తొలుత జూన్‌ 14న ఫలితాలను వెల్లడిస్తామని చెప్పి.. అంతకంటే ముందే ఓట్ల లెక్కింపు జరుగుతుండగా విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ పరీక్షలో పేపర్‌ లీకేజీ జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఈ ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ చైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. మరోపక్క సుప్రీంకోర్టులో ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags:    
Advertisement

Similar News