వారే నిజమైన బలవంతులు.. – సీజేఐ డీవై చంద్రచూడ్
వ్యక్తిత్వ వికాసం, విలువల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన మాటే నెగ్గాలన్న మనస్తత్వాన్ని పక్కనబెట్టి.. ఇతరుల మాటను కూడా వినే పరిణతి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని ఆయన సూచించారు.
సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారు, మానవత్వంతో ప్రవర్తించేవారే నిజమైన బలవంతులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. దాడులు, హింస, ఇతరులను అగౌరపర్చడం ద్వారా ఒకరు తమ ఆధిపత్యం చూపించుకోగలరని అనుకోవడం పొరపాటే అని చెప్పారు. మన లక్ష్య సాధన పట్ల కృతనిశ్చయంతో ఉన్నప్పుడు విజయం లభిస్తుందని ఆయన తెలిపారు.
మహారాష్ట్రలోని పుణేలో గల సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవంలో పాల్గొన్న చీఫ్ జస్టిస్.. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాసం, విలువల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన మాటే నెగ్గాలన్న మనస్తత్వాన్ని పక్కనబెట్టి.. ఇతరుల మాటను కూడా వినే పరిణతి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని ఆయన సూచించారు.
మన సమాజంలో ఉన్న సమస్య అదే..
ఇతరుల మాటను వినడం అనేది.. జీవితంలోని ప్రతి దశలో చాలా ముఖ్యమని చీఫ్ జస్టిస్ చెప్పారు. కానీ.. మనం ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోవట్లేదని, కేవలం మన మనసు చెప్పిన మాట మాత్రమే వింటున్నామని ఆయన తెలిపారు.
మన సమాజంలో ఉన్న సమస్య అదేనని ఆయన చెప్పారు. ఇతరుల మాటను వినే పరిణతి మనలో ఉన్నప్పుడే.. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. జీవితం అనేది ఓ ప్రత్యేకమైన పద్ధతిలో మనకు పాఠాలు బోధిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో వినయం, ధైర్యం, చిత్తశుద్దిని మన సహచరులుగా చేసుకోవాలని ఆయన చెప్పారు.