విజయ్‌ పార్టీపై రజినీకాంత్‌ స్పందన ఇదే

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు విజయ్‌ తన పార్టీతో సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన తన పార్టీ గుర్తుపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం.

Advertisement
Update:2024-02-06 19:46 IST

ప్రముఖ సినీ నటుడు విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశంపై అగ్ర నటుడు రజినీకాంత్‌ స్పందించారు. ‘విజయ్‌కి నా శుభాకాంక్షలు’ అంటూ ఆయన స్పందించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని కొన్నాళ్లుగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. దానిని నిజం చేస్తూ తాజాగా ఆయన తన పార్టీని స్వయంగా ప్రకటించారు. ’తమిళగ వెట్రి కట్చి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ నెలకొల్పుతున్నట్టు ప్రకటించిన విజయ్‌.. 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్‌ అని చెప్పారు. ఈ ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నిక‌ల్లో తమ పార్టీ చేయదని కూడా ఆయన స్పష్టం చేశారు.

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇక డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ ఇటీవల కన్నుమూశారు. దీంతో తమిళ రాజకీయాల్లో సరైన ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొంది. మరో అగ్ర కథానాయకుడు కమల హాసన్‌ కూడా ’మక్కల్‌ నీది మయ్యుం’ పార్టీ స్థాపించి తమిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆయన పార్టీ అంతగా ప్రభావం చూపడం లేదు. ఇక చాలాకాలంగా రాజకీయాల్లోకి రావాలని భావించిన రజినీకాంత్‌ కూడా ఆరోగ్యం సహకరించడం లేదంటూ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

మరోపక్క అధికార డీఎంకేను సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు విజయ్‌ తన పార్టీతో సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన తన పార్టీ గుర్తుపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉండాలని పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ అభిమాన సంఘాల నిర్వాహకులతో చర్చలు సాగిస్తున్నారు. మరో విషయమేమంటే.. పార్టీ పేరును రిజిస్టర్‌ చేసిన సమయంలో 5 గుర్తులను ఎన్నికల కమిషన్‌కు అందజేశారని, అందులో మహిళలను ఆకట్టుకొనే విధంగా గుర్తు ఉందని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News