ముఖ్యమంత్రి కార్యాలయంపై రాళ్ల దాడి.. - ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలోని ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సీఎం కార్యాలయంలోకి తీసుకెళ్లారు.
మేఘాలయ ముఖ్యమంత్రి కార్యాలయంపై సోమవారం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనలో సీఎం కన్రాడ్ సంగ్మా క్షేమంగానే ఉన్నారు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేయడంతో ఆయనతో పాటు ఓ మంత్రి కూడా కార్యాలయంలోనే ఉండిపోయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గారో హిల్స్‌కు చెందిన పౌర సమాజ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సీఎం కార్యాలయం బయట వందలాదిమంది నిరసన కారులు గుమిగూడారు. ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలోని ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సీఎం కార్యాలయంలోకి తీసుకెళ్లారు.
అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనకు ముందు దాదాపు మూడు గంటల పాటు సీఎం సంగ్మా రాజధాని ఏర్పాటు అంశంపైనే పౌరసంఘాల ప్రతినిధులతోనే చర్చిస్తున్నట్టు సమాచారం. ఆ సమయంలోనే కొందరు వ్యక్తులు రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. రాళ్లు విసిరినవారు పౌరసంఘాలతో సంబంధం లేనివారుగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 8 లేదా 9 తేదీల్లో షిల్లాంగ్‌లో చర్చలకు రావాలని పౌరసంఘాల ప్రతినిధులను సీఎం సంగ్మా ఆహ్వానించారు.