క్షమాపణ కోరిన సోనూ సూద్.. ఎందుకంటే..?
నార్తర్న్ రైల్వే నుంచి ఓ ట్వీట్ వచ్చింది. సోనూ సూద్ మీరిలా చేస్తారనుకోలేదంటూ నార్తన్ రైల్వే అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కాస్త ఘాటుగానే ఓ ట్వీట్ వేశారు. దీనిపై సోనూ సూద్ స్పందించారు.
కరోనా సమయంలో వలస కార్మికుల దేవుడిగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్.. ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దేశం నలుమూలలా సోనూ సూద్ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఆయన్ను రియల్ లైఫ్ హీరోలా అందరూ ఆరాధిస్తున్నారు. అలాంటి సోనూ సూద్ ఇటీవల చేసిన ఓ ఫీట్ నెటిజన్ల మనసు నొప్పించింది. ఆ స్థాయిలో ఉన్న సోనూ, ఇలాంటి సందేశం ఇస్తున్నారేంటి అని కొంతమంది అసహనంతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్ ని ఆయన పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు నార్తర్న్ రైల్వే నుంచి ఓ ట్వీట్ వచ్చింది. సోనూ సూద్ మీరిలా చేస్తారనుకోలేదంటూ నార్తన్ రైల్వే అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కాస్త ఘాటుగానే ఓ ట్వీట్ వేశారు. దీనిపై సోనూ సూద్ స్పందించారు. నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేశారు.
అసలేమైంది..?
సోనూ సూద్ ఇటీవల రైలులో ప్రయాణం చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రైలు బోగీ ఫుట్ బోర్డ్ దగ్గర ఆయన కూర్చుని ప్రయాణం చేస్తున్న వీడియో అది. గతేడాది డిసెంబర్ 13న ఆయన వీడియో షేర్ చేయగా, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అలా ప్రయాణించడం ప్రమాదకరం అంటూ కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఆయన్ను చూసి అభిమానులు కూడా అలాంటి సాహసం చేసే అవకాశముందని అన్నారు. దీనిపై సోనూ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ రైల్వే నుంచి కూడా వ్యతిరేకంగా ట్వీట్ వచ్చే సరికి ఆయన తనను క్షమించాలంటూ ట్వీట్ పెట్టారు. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా ఇటీవల ఈ వీడియోపై స్పందించింది. ఇలాంటి ఫీట్లు ఎవరూ అనుకరించొద్దని తేల్చి చెప్పింది.
సోనూ వివరణ..
విమర్శలపై క్షమాణలు చెబుతూనే సోనూ సూద్ వివరణ కూడా ఇచ్చారు. ‘రైలు డోరువద్దే మగ్గిపోతున్న పేదల జీవితాలను అర్థం చేసుకునేందుకు నేను అక్కడ కూర్చుకున్నాను. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపరిచినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు సోనూ సూద్. కేవలం సందేశం ఇవ్వడం కోసమే తాను ఆ వీడియో చేశానన్నారు, ఇలా వివాదం అవుతుందని అనుకోలేదని చెప్పారు.