కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసిన సిద్ధూ.. రాహుల్, ప్రియాంకతో కూడా భేటీ
ఖర్గేతో మాట్లాడిన తర్వాత ఆయన చాలా ప్రశాంత వాతావరణాన్ని, జోష్‌ను తీసుకొని వచ్చారని సిద్ధూ చెప్పారు.
ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిశారు. అణగారిన వర్గాల కోసం పనిచేసే గొప్పనాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే అని సిద్ధూ అభివర్ణించారు. ఈ మేరకు సిద్ధూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఖర్గే ఎప్పుడూ సత్యాన్ని ఎలుగెత్తి చాటే గొంతుక అని ప్రశంసల వర్షం కురిపించారు. జైలు జీవితం గడిపి.. తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చిన సందర్భంగా ఖర్గే ఆశీర్వాదం కోసం వచ్చినట్లు సిద్ధూ చెప్పారు.
ఖర్గేతో మాట్లాడిన తర్వాత ఆయన తనలో చాలా ప్రశాంత వాతావరణాన్ని, జోష్‌ను తీసుకొని వచ్చారని చెప్పారు. 9 సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా పని చేసిన ఆయన.. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన చాంపియన్ ఖర్గే అని సిద్దూ ట్వీట్ చేశారు. సిద్ధూ మొదట ఎంపీ జైరామ్ రమేశ్‌ను కలవగా.. ఆయన ఖర్గే వద్దకు తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్‌ను కూడా కలిసి కాసేపు ముచ్చటించారు.
గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సిద్దూ కలిశారు. ఆ వెంటనే పార్టీ అగ్రనాయకత్వాన్ని శుక్రవారం కలిసి తాను మరింత దూకుడుగా పని చేస్తానని వారికి మాట ఇచ్చారు. తనను అణిచి వేయాలని చూసినా, జైల్లో ఉంచినా పంజాబ్ బాగు కోసం చిత్తశుద్ధితో చేసే పనిని ఎవరూ తగ్గించలేరని సిద్ధూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం బందిఖానాలో ఉందని, వ్యవస్థలను బానిసలుగా మార్చేసిన ఘనత మోడీ సర్కార్‌దే అని సిద్ధూ మీడియాతో వ్యాఖ్యానించారు.