రాష్ట్రపతి ఎన్నికల వేళ.. విపక్షాల ఐకమత్యం ఏంటో చూపించాలనుకున్నారు నేతలు. కానీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీటింగ్ తోటే విపక్షాల్లో ఉన్న అనైక్యత బయటపడింది. ఆ తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఎంపిక చేసి పక్కా ప్లానింగ్ తో వెళ్తోంది. తటస్థులు అనుకున్నవారే కాదు, బీజేపీ వ్యతిరేక ముద్రపడినవారు కూడా ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న ఉద్ధవ్ శివసేన ద్రౌపది ముర్ముకి మద్దతు ప్రకటించింది. తాను బీజేపీకి దూరం అని చెబుతూనే, ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చింది. తాజాగా జార్ఖండ్ లో కూడా అదే జరిగింది. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కూడా తన మిత్రపక్షం కాంగ్రెస్ ని కాదని, బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. భవిష్యత్ రాజకీయాలపై సందేహాన్ని మిగిల్చింది.
మహారాష్ట్ర తర్వాత గోవాలో ఏదో జరగబోతోంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరుకుంటున్నారు అనే వార్తలొచ్చాయి, కానీ అక్కడ హడావిడి తప్ప పని జరగలేదు. కానీ అనుకోకుండా జార్ఖండ్ ప్రభుత్వంలో చిచ్చు రేగింది. 81 అసెంబ్లీ సీట్లు ఉన్న జార్ఖండ్ లో జేఎంఎం(30), కాంగ్రెస్(16) భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ బీజేపీ 25 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారానికి దూరమైంది. కానీ కొన్నాళ్లుగా జేఎంఎంని దువ్వుతోంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల వేళ జేఎంఎం, బీజేపీ బుట్టలో పడిపోయింది.
గిరిజన మహిళ కాబట్టే..
ఎన్డీఏ అలయెన్స్ లో లేకపోయినా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చిన పార్టీలన్నీ ఆమె గిరిజన మహిళ కాబట్టే తాము మద్దతిస్తున్నాం కానీ, బీజేపీ విధానాలు నచ్చి కాదు అని చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన మద్దతిచ్చినా అక్కడ ఆ పార్టీ అధికారంలో లేదు కాబట్టి పెద్దగా సంచలనాలు జరగవు. కానీ జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ తో కూటమిలో ఉంటూ, అధికారాన్ని పంచుకుంటూ సడన్ గా ప్లేటు ఫిరాయించింది. ఈనెల 4న జార్ఖండ్ కి వచ్చిన ద్రౌపది ముర్ముకి జేఎంఎం అధినేత, ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ సాదర స్వాగతం పలికారు కానీ మద్దతిస్తున్నట్టు చెప్పలేదు. ఈనెల 16న యశ్వంత్ సిన్హా జార్ఖండ్ రావాల్సి ఉండగా సడన్ గా ఒకరోజు ముందే హేమంత్ సోరెన్ తమ మద్దతు బీజేపీ అభ్యర్థికేనంటూ తేల్చేశారు. దీంతో కాంగ్రెస్ కి పెద్ద షాక్ తగిలినట్టయింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఒకవేళ స్పందించినా, జేఎంఎంకి దూరం జరిగినా జార్ఖండ్ లో ప్రభుత్వం పడిపోదు. పాతిక సీట్లు ఉన్న బీజేపీ తాను అండగా ఉంటానంటూ జేఎంఎం పంచన చేరుతుంది. అందుకే కాంగ్రెస్ ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి.