జమిలి ఎన్నికలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం
దేశంలో జమిలి ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల ఆలోచన విరమించుకోవాలని పినరయి సర్కార్ ఎన్డీయే ప్రభుత్వన్నికి విజ్ఞప్తి చేసింది
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై దేశంలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేరళ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలి ఎలక్షన్ ఆలోచన విరమించుకోవాలని విజయన్ ప్రభుత్వం ఎన్డీయే సర్కార్‌కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇవాళ శాసన సభలో తీర్మాణం చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమైఖ్యతకు హానికరం అని తీర్మాణం లో పేర్కొంది. కాగా దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలకు దేశమంతటా సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో కేరళ అసెంబ్లీ జమిలిని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మాణం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై తీవ్ర దుమారం రేగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు