అయ్యప్పకు రూ.223 కోట్ల ఆదాయం - వైభవంగా మండల పూజ ముగింపు ఉత్సవం
భక్తుల దర్శనం అనంతరం మంగళవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. ఈ 41 రోజుల్లో 39 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని కేరళ దేవదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి 39 రోజుల్లో రూ.222.98 కోట్ల ఆదాయం లభించింది. దేవస్వోమ్ బోర్డు మంగళవారం ఈ విషయం వెల్లడించింది. 41 రోజుల మండల పూజ ముగింపు మహోత్సవం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ప్రధాన పూజారి(తంత్రి) కందరారు రాజీవర్ ఆధ్వర్యంలో మణికంఠుడి విగ్రహానికి బంగారు వస్త్రం(తనకా అంకి) అలంకరించి కలశాభిషేకం పూజలు చేశారు. ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు అధికారులు, వేలాది మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి భక్తుల దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేశారు. ఈ 41 రోజుల్లో 39 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని కేరళ దేవదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు.
మకర జ్యోతి(మకర విలక్కు) ఉత్సవాల కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 14న మకర విలక్కు పూజలు నిర్వహించి, 20న ఆలయాన్ని మూసివేస్తారు. దీంతో అయ్యప్ప ఆలయంలో వార్షిక యాత్రా సీజన్ ముగుస్తుంది