సంచలనం సృష్టిస్తున్న పుస్తకం...జెపి కి ఆర్ఎస్ఎస్ చేసిన ధోకా ఏంటి ?
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ను ఆరెస్సెస్ ఎలా మోసం చేసిందో వివరించారు కన్నడ రచయిత దేవనూర మహాదేవ. తాను రాసిన 'ఆర్ఎస్ఎస్ : డెప్త్ & బ్రెడ్త్' పుస్తకంలో దానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన వివరాలను పొందుపర్చారాయన.
కన్నడ రచయిత దేవనూర మహాదేవ రాసిన 'ఆర్ఎస్ఎస్ : డెప్త్ & బ్రెడ్త్ అనే ఓ చిన్న పుస్తకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ పుస్తకం అన్ని భాషల్లోకి అనువాదం అయ్యి లక్షల కాపీలు అమ్ముడు పోతున్నాయి. ప్రముఖ సోషలిస్టు నేత జయప్రకాష్ నారయణ్ ను ఆరెస్సెస్ నేతలు ఎలా మోసగించారో ఈ పుస్తకంలో ఆధారాలతో సహా వివరించారు రచయిత.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చోదక శక్తిగా, ఆ భావజాలంతో పనిచేసే భారతీయ జనతా పార్టీ (బిజెపి) వెన్నుపోట్లు పొడవడం, అధికారాలను లాక్కోవడం ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదని చరిత్ర చెబుతోంది. బిజెపి పూర్వ రూపమైన జనసంఘ్ మొదలు.. వాజపేయి నుంచి నేటి మోడీ వరకూ బీజేపీ నాయకులు నమ్మిన వారిని ఎలా మోసం చేశారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తామే ముందుండి ఉద్యమాన్ని నడిపించి గెలిపించామని బిజెపి పూర్వ రూపమైన జనసంఘ్ ప్రకటించుకుంది. ఆ తర్వాత ప్రతి యేడాది ఎమర్జెన్సీ వార్షికోత్సవం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ , ముఖ్యంగా దాని రాజకీయ విభాగమైన బిజెపి నాయకులు జయప్రకాశ్ నారాయణ్ ను స్మరించుకుంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. అయితే ఇది సత్యదూరమని, ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ దారుణంగా వ్యవహరించిందని ప్రముఖ న్యాయవాది ఎ.జి.నూరాని అప్పట్లో ఆయన రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు. వాస్తవానికి ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జయప్రకాశ్ నారాయణ్ (జెపి)దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో, ఇందిరా గాంధీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ జెపి నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఉద్యమంలోకి అప్పటి జనసంఘ్ నేతలు(బిజెపి) చొరబడడంతో దాని పాత్ర పూర్తిగా మారిపోయిందని కన్నడ రచయిత దేవనూర మహాదేవ రాసిన 'ఆర్ఎస్ఎస్ : డెప్త్ & బ్రెడ్త్ (2022)'అనే పుస్తకంలో పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ్ ను ఎలా మోసగించారో ఆయన వివరించారు.
జెపి నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన జనతా పార్టీలో చేరిన అప్పటి జనసంఘ్ (తరువాత బిజెపిగా మారింది) లోని ఆర్ఎస్ఎస్ సభ్యులు తాము ఆర్ఎస్ఎస్ సభ్యత్వాన్ని వదులుకుంటామని హామీ ఇచ్చారు. అలాంటి వాగ్దానాలు చేసిన వారిలో ప్రముఖులు ఎ.బి. వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరాస్ ఉన్నారు. జెపి వారి మాటలను విశ్వసించారు, కానీ వారు తమ ఆర్ఎస్ఎస్ అనుబంధాన్ని, సభ్యత్వాన్ని ఎన్నడూ వదులుకోలేదు . ఇది రాజకీయ ఎత్తుగడ అని ఆయన పేర్కొన్నారు. విచిత్రమేమిటంటే జెపిని బిజెపి తమ ఐకాన్ గా చెప్పుకుంటుంది.
జేపీ గురించి మహాదేవ రాసిన విషయాలపై, జేపీ అరెస్టయినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఎం.జి. దేవసహాయం మాట్లాడుతూ.. తనకు జెపితో ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా మహాదేవ వివరించారని తెలిపారు. జనసంఘ్ (బిజెపి) నాయకులు తనను ఎలా మోసం చేశారో చెబుతూ జేపీ ఎంతో బాధపడ్డారని దేవసహాయం వివరించారు.
"జయప్రకాశ్ నారాయణ్(జెపి)ను డిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ ' మిసా' చట్టం(మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద అరెస్టు చేశారు. ఆయన 'అత్యవసర ఖైదీ'(ఎమర్జెన్సీ ప్రిజనర్) అయినందున సురక్షితమైన కస్టడీ కోసం చండీగఢ్‌కు మార్చారు. అప్పుడు జిల్లా మేజిస్ట్రేట్ గా ఉన్న నేను జైలులో అతనికి సంరక్షకుడిగా ఉన్నాను. కానీ జెపి గృహనిర్భంధంలో ఉన్నారని, తాను సంరక్షకుడిగా ఉన్నానన్న విషయాలు తప్ప దేవనూర తనపుస్తకంలో రాసిన మిగిలిన విషయాలన్నీ నిజం, ఎందుకంటే జెపి స్వయంగా నాతో ఈ విషయాలు చర్చించారు. ఎమర్జెన్సీ సంస్కృతిని సృష్టించిన ఈ వ్యవస్థలో జనతా పార్టీ నాయకులు కూడా భాగమేనని ఆయన నాతో చెప్పారు. కానీ వారి చేరికతో జెపి కలలు గన్న మంచి పార్టీ గా జనతా పార్టీ అవతరించలేకపోయింది. ప్రధానంగా ఆర్ ఎస్ ఎస్, జనసంఘ్ చేసిన కుతంత్రాలు, ద్రోహం కారణంగా జనతా పార్టీ ప్రభుత్వం 1979 మధ్యలోనే కూలిపోయింది." అని దేవసహాయం వివరించారు.
"ఈ పతనం తర్వాత మళ్ళీ జనతాపార్టీ కోలుకోలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకు నేను పాట్నాలోని కదమ్ కువాన్ నివాసంలో జెపిని కలుసుకున్నాను. ఆయన అప్పుడు డయాలసిస్ చికిత్సలో ఉన్నారు. నన్ను అతని పక్కన కూర్చోబెట్టుకొని.. "దేవసహాయం, నేను మళ్ళీ విఫలమయ్యాను. ఈ ద్రోహం అత్యంత దారుణం'' అంటూ ఎంతో ఆవేదనతో జేపీ కన్నీళ్ళు పెట్టుకున్నారు. నాయకుల తీరుతో జనతా పార్టీ పతనం ఆయన హృదయాన్ని తీవ్రంగా గాయపర్చింది. ఆయనను నేను ఓదార్చలేకపోయాను. జయప్రకాశ్ నాయణ్ తనతో ఇంకా ఎన్నో విషయాలు చెబుతూ ఆవేదన చెందారు." అన్నారు దేవసహాయం. భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ అనుంగు అనుచరుడిగా నిబద్ధత గల సైనికుడిగా పనిచేసిన జయప్రకాశ్ నారాయణ్ ..రెండో స్వాతంత్య్ర పోరాటంగా భావించే ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో దాదాపుగా ఒంటరిగా పోరాడిన ఈ విప్లవ యోధుడు అక్టోబర్ 8, 1979న విరిగిన హృదయంతో మరణించాడు.
నాటి నుంచి నేటి వరకూ..
ఆర్ఎస్ఎస్ కానీ , దాని కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ విధానాలు, ఆచరణలు నేటికీ అలాగే ఉన్నాయని చెప్పాలి. హిందూత్వ ఎజెండా ఆధారంగా మతపరమైన విషాన్ని వ్యాపింపజేయడం, ప్రజాస్వామ్య విలువలను హరించడం, స్వేచ్ఛను నిర్వీర్యం చేయడం , ప్రభుత్వ ఆస్తులను విచక్షణారహితంగా ప్రైవేటీకరిస్తూ, ఆర్థిక వ్యవస్థను బిజెపి అనుకూల కార్పోరేట్లకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం.
విచిత్రమేమిటంటే .. జెపిని మోసం చేసిన బిజెపి అగ్రనాయకుడు ప్రధాని వాజ్‌పేయి, ఆ మహానేతను అంపశయ్యపై ఉన్న భీష్మపితామహుడితోను, సిలువపై ఉన్న యేసుక్రీస్తుతోనూ పోల్చారు. నిజంగా ఆ నివాళులు అత్యద్భుతమే. ధైర్యం, కరుణ, త్యాగాల కలబోతతో అద్వితీయమైన మానవతా మూర్తిగా జయప్రకాశ్ నారాయణ్ ను ఆర్ఎస్ఎస్ ఒప్పుకున్నా లేకున్నా అంతా అంగీకరిస్తారనడంలో సందేహం లేదు.