Ban on IT-Hardware Products | ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే..!
కేంద్రం మూడు పారా మీటర్లు రూపొందించింది. గత ఏడాది కాలంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఐటీ ఉత్పత్తులు, విదేశాలకు మూడేండ్ల పాటు ఎగుమతి చేస్తున్న ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల సగటు విలువ ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది.
గ్లోబల్ టెక్ దిగ్గజాలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్లను ఉచితంగా దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదని ప్రకటించింది. 2024 సెప్టెంబర్ వరకూ దిగుమతి చేసుకుంటున్న లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్లపై కేంద్రం ఎటువంటి నాణ్యతా నిబంధనలు అమలు చేయబోదు. కేంద్రం తాజా నిర్ణయం వల్ల డెల్, హెచ్‌పీ, ఆపిల్, శాంసంగ్, అసుస్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలకు లబ్ధి చేకూరుతుంది.
విదేశాల నుంచి గ్లోబల్ టెక్ కంపెనీలు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతిని నియంత్రించడానికి విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) కొత్తగా ఆన్‌లైన్‌లో `దిగుమతి యాజమాన్య వ్యవస్థ (Import Management System)` రూపొందిస్తుంది. ఈ పోర్టల్‌లో వీటిని దిగుమతి చేసుకునే కంపెనీలు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసిన `దిగుమతి యాజమాన్య వ్యవస్థ` పోర్టల్‌లో ఆయా కంపెనీలు దిగుమతి చేసుకుంటున్న డేటా వివరాలు నమోదు చేయాలి.
ఇందుకోసం కేంద్రం మూడు పారా మీటర్లు రూపొందించింది. గత ఏడాది కాలంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఐటీ ఉత్పత్తులు, విదేశాలకు మూడేండ్ల పాటు ఎగుమతి చేస్తున్న ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల సగటు విలువ ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. అంతే కాదు, 2024 సెప్టెంబర్ తర్వాత కూడా నిషేధాజ్ఞలను కేంద్రం సమీక్షిస్తుంది. దశల వారీగా దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకం తగ్గించే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తుంది.
తక్షణం ఐటీ, హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతిపై ఎటువంటి నిషేధం విధించబోవడం లేదని మీడియా వర్గాల కథనం. విదేశాల్లో అసెంబ్లింగ్ చేసిన ఐటీ ఉత్పత్తులు - లాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్లు దిగుమతి చేసుకుంటున్న సంస్థలు.. కేంద్ర ప్రభుత్వానికి అదనంగా దిగుమతి సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు.
విదేశాల నుంచి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్ల దిగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. దాని ప్రభావంపై చర్చించేందుకు ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమ ప్రతినిధులు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సమావేశం అయ్యారు. మంత్రితో జరిగిన చర్చల్లో డెల్, శాంసంగ్, శాంసంగ్, ఇంటెల్, అసుస్, ఎసేర్, ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ), మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (మైట్) ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఐటీ పరికరాలు, టాబ్లెట్లు, లాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లను తయారీదారు దేశంలోని సెజ్‌ల్లో పూర్తిగా అసెంబ్లింగ్ చేయాలి. అలాగే, మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో ఐటీ, హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల వివరాలు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు.
డిజిటల్ ఎకో సిస్టమ్ కోసం టాబ్లెట్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు విశ్వసనీయమేనా.. ? అన్న సంగతి తెలుసుకోడానికి రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న టాబ్లెట్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లకు దేశీయ కంపెనీలు 8-10 శాతం విడి భాగాలను సరఫరా చేస్తున్నారు. వీటి అసెంబ్లింగ్‌లో వచ్చే మూడేండ్లలో 65-70 శాతం వరకూ దేశీయంగా విడి భాగాల తయారీ పెంచుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ అభిమతం అని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతిపై గత నెల మూడో తేదీన కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలంటే సంబంధిత కంపెనీలు లైసెన్స్ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.