రన్‌ టు 'రన్‌'.. టెంట్‌ సిటీ ఉత్సవాలు షురూ

కచ్‌ అంటే కొంతవరకు గుర్తొస్తుంది. కానీ, ఈ తరానికి అది కూడా కష్టమే. ఒకటి– రెండు తరాల కిందట అమ్మాయిలు ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్లు. అందులో కచ్‌ వర్క్‌ వస్తే ఎంబ్రాయిడరీలో పీజీ వచ్చినట్లన్నమాట.

Advertisement
Update:2022-11-11 07:01 IST

'ద టెంట్‌ సిటీ' క్యాప్షన్‌తో రన్‌ ఉత్సవాలు మొదలయ్యాయి. రన్‌ అంటే మనకు వెంటనే గుర్తు రావడం కష్టమే. కచ్‌ అంటే కొంతవరకు గుర్తొస్తుంది. కానీ, ఈ తరానికి అది కూడా కష్టమే. ఒకటి– రెండు తరాల కిందట అమ్మాయిలు ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్లు. అందులో కచ్‌ వర్క్‌ వస్తే ఎంబ్రాయిడరీలో పీజీ వచ్చినట్లన్నమాట. ఈ ఎంబ్రాయిడరీ పుట్టిన ఊరే కచ్‌. ఇది గుజరాత్‌లో ఉంది. ఇక్కడ సముద్రతీరాన ఏటా జరిగే ఉత్సవాలే ఈ రన్‌ ఆఫ్‌ కచ్‌ ఉత్సవాలు. ఈ ఉత్సవాల కోసం గుడారాలతో ఏటా ఏకంగా ఒక నగరాన్నే నిర్మిస్తారు.


ఏమేమి ఉంటాయి?

సంగీతం, నాట్యం.. వీటికి నేపథ్యం తెల్లటి ఎడారి వంటి ఉప్పు నేలలు. ఈ అద్భుతాన్ని చూడడానికే వచ్చినట్లు.. ఆకాశం కిటికీకి ఉన్న మబ్బు తెరలు తీసి తొంగి చూస్తున్నట్లు నిండు చంద్రుడు.. రాత్రి పూట కనువిందు చేస్తాయి. పగలైతే సూర్యుడు దేదీప్యమానంగా.. తెల్లటి ఉప్పు మీద కిరణాల దాడి చేస్తుంటాడు. తెల్లటి ఉప్పు నేల ఏడురంగుల్ని ప్రతిఫలిస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. ఈ ప్రకృతి నైపుణ్యాన్ని తలవంచి ఆస్వాదించాల్సిందే. తలెత్తి చూస్తే సూర్యకిరణాల్లోని ఏడురంగులు ఒకేసారి కళ్ల మీద దాడి చేస్తున్నట్లుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కళ్లు బైర్లుకమ్మేస్తాయి.


ఎప్పుడు వెళ్లవచ్చు!

రన్‌ మహోత్సవ్‌ ఏటా శీతాకాలంలో మూడు నెలలపాటు జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 26న మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవాలకు టూర్‌ ప్యాకేజ్‌లు ఉంటాయి. నిండు పున్నమి రోజుల్లో టెంట్‌ సిటీలో రాత్రి బస ఉండేటట్లు ప్లాన్‌ చేసుకుంటే టూర్‌ని ఆద్యంతం ఆస్వాదించవచ్చు.


వెన్న కుండలుంటాయి!

ఉప్పు నేల మీద ఎర్రటి తివాచీ పరుచుకుని, ఎర్రటి తలపాగాలు చుట్టుకున్న కళాకారులు సంప్రదాయ గుజరాతీ కచ్‌ జానపద సంగీతాన్ని ఆలపిస్తుంటారు. హాండీక్రాఫ్ట్స్‌ విలేజ్‌లో రంగురంగుల కుండల మీద చూపు ఆగిపోతుంది. కృష్ణుడు వెన్న దొంగలించిన ఘట్టాలు కళ్ల ముందు మెదలుతాయి. ట్రిప్‌కి గుర్తుగా ఒక కుండను తెచ్చుకోవచ్చు. చక్కగా ప్యాక్‌ చేసిస్తారు. ఇక దుస్తులైతే కచ్‌ టెక్స్‌టైల్స్, కచ్‌ వర్క్‌ ఎంబ్రాయిడరీ వందల రకాలు దేనికందే ప్రత్యేకంగా ఉంటాయి.


ఒంటెబండి విహారం

మన దగ్గర ఒంటెద్దు బండి ప్రయాణం తెలుసు. అది కూడా ఓ యాభై ఏళ్ల కిందట మహిళలు గూడుబండిలో ప్రయాణించేవాళ్లు. ఇక్కడ మాత్రం ఒంటె బండి విహారం ప్రత్యేకత. హనీమూన్‌ కపుల్‌కి ఒంటె సవారీ, కుటుంబంతో వెళ్లిన వాళ్ల కోసం ఒంటెబండి సవారీ రెండూ ఉంటాయి. సూర్య కిరణాలు సోకి తెల్లగా మిలమిల మెరుస్తున్న ఉప్పు మడుల్లో ఒంటె పాదాల ముద్రలు పడుతుంటాయి. కొంత సేపటికే ఉప్పు కరిగి పాదముద్రలు మాయమైపోతాయి. మాండవి తీరాన ఒంటె సవారీ కూడా మంచి అనుభూతిగా మిగులుతుంది. ఒంటెబండి సవారీతోపాటు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఎక్కిస్తే పిల్లలకు టూర్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సంతోషాన్నిచ్చినట్లే.

Tags:    
Advertisement

Similar News