రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీ
గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై నేడు సంప్రదింపుల సమావేశం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో చేపట్టున్న కులగణన కోసం మేధావులు, ప్రజా సంఘాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు . ఈ కార్యక్రమంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు.
కులగణనపై మేధావులు, బీసీ, విద్యార్థి, పౌర సంఘాల ప్రతినిధులతో రాహుల్ నేరుగా మాట్లాడుతారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. అనంతరం కులగణన ప్రయోజనాల్ని వారికి రాహుల్ వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణలో చేపట్టే ఈ కులగణనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టబోయే కులగణనకు ప్రామాణికంగా తీసుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ దీనిపై పౌర సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత పార్టీ నేతలకు దీనిపై దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ సమావేశానికి ముందే సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుల సమావేశమై దీనికి సంబంధించి సమీక్ష చేసే అవకాశం ఉన్నది.
రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి దాదాపు 8 కిలోమీటర్లు ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణం చేయనున్నారు. ఈ 8 కి.మీ మేర భారీ కటౌట్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాట్లు చేశారు. రాహుల్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలుకడానికి రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది.