బస్ టికెట్లు కొనట్లేదు, కరెంటు బిల్లులు కట్టట్లేదు
ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన మహిళలెవరూ టికెట్లు తీసుకోవడంలేదు. చాలామంది సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఈ గొడవలు ఎక్కువవుతున్నాయని, వెంటనే ఆ హామీపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది కేఎస్ఆర్టీసీ.
ఉచిత హామీలు అధికారాన్ని కట్టబెట్టొచ్చేమో కానీ, ఆ తర్వాత వాటి అమలు విషయంలో ప్రభుత్వాలను ఇరుకున పెట్టడం మాత్రం ఖాయం. దీనికి కర్నాటకే తాజా ఉదాహరణ. అవును, కర్నాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 5 ప్రధాన హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలులో పెడతామని నాయకులు కాస్త గట్టిగానే చెప్పారు. కానీ కర్నాటకలో సీఎం కుర్చీ పంచాయితీ తీరింది కానీ హామీల అమలు మాత్రం పట్టాలెక్కలేదు. తొలి మంత్రి వర్గ సమావేశంలో కార్యాచరణ నిర్ణయించలేదు. జులైలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో ఈ హామీలపై స్పష్టత వస్తుందని అంటున్నారు నాయకులు. కానీ అప్పటి వరకు జనాలు ఆగట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి, హామీలు అమలు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.
ఆ ఐదు హామీలు ఇవే..
- గృహ జ్యోతి పథకం కింద ప్రతి బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్
- గృహ లక్ష్మి స్కీం కింద కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ. 2 వేల ఆర్థిక సాయం
- అన్న భాగ్య పథకం కింద కుటుంబంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం
- యువనిధి స్కీం కింద డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రూ. 3 వేలు ఆర్థిక సాయం
- మహిళా శక్తి స్కీం కింద రాష్ట్రమంతా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఆ రెండే కీలకం..
ప్రస్తుతం ఇందులో రెండు హామీల అమలుకోసం జనం పట్టుబడుతున్నారు. గ్రామాల్లో పేద ఇళ్ల వద్దకు కరెంటు బిల్లులు తీసేందుకు సిబ్బంది వస్తే వారిని తరుముకొంటున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది తాము కరెంటు బిల్లులు కట్టేది లేదని తెగేసి చెబుతున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందితో గొడవకు దిగుతున్నారని అంటున్నారు. కానీ అవన్నీ ఫేక్ వీడియోలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. విద్యుత్ సిబ్బందితో గొడవల సంగతి పక్కనపెడితే.. కరెంటు బిల్లులు కట్టేది లేదని ప్రజలు తెగేసి చెప్పడం విశేషం.
మహిళా శక్తి..
ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన మహిళలెవరూ టికెట్లు తీసుకోవడంలేదు. చాలామంది సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారని, అదిప్పుడు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవలు ఎక్కువవుతున్నాయని, వెంటనే ఆ హామీపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది కేఎస్ఆర్టీసీ.
వైరి వర్గాల కుట్రేనా..?
అయితే ఇదంతా వైరి వర్గాల కుట్ర అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. సామాన్య ప్రజలెవరూ హామీల అమలు కోసం డిమాండ్ చేయట్లేదని, బీజేపీ ప్రేరేపించిన కొందరు మాత్రమే ఇలా రోడ్డున పడుతున్నారని అంటున్నారు. వీలైనంత త్వరలో తమ హామీలు అమలు చేస్తామని ప్రజలకు నచ్చజెబుతున్నారు నాయకులు.