పార్టీలో చిచ్చు పెడుతున్న దేవెగౌడ పెద్ద కోడలు
జేడీఎస్ తరపున దేవెగౌడ కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద కోడలు భవానీ కూడా పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో గొడవ మొదలైంది.
కర్నాటక ఎన్నికల వేళ దేవెగౌడ కుటుంబంలో గొడవ మొదలైంది. అది క్రమంగా పార్టీలో చిచ్చుగా మారే అవకాశముంది. దేవెగౌడ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా కట్టడి చేయడం కుదర్లేదు. చివరకు సామరస్యంగా చర్చలు మొదలయ్యాయి. చర్చలు పూర్తి కాకముందే దేవెగౌడ పెద్ద కోడలు భవానీ మూతి ముడుచుకుని వెళ్లిపోయారు. ఆమె వెంట భర్త రేవణ్ణ బయటకు వెళ్లిపోయారు. వృద్ధాప్యంలో ఈ కొట్లాటను తీర్చలేక పార్టీ పరిస్థితి తలచుకుని బాధపడుతున్నారు దేవెగౌడ. చిన్న కొడుకు కుమారస్వామికే సర్దిచెప్పాలనుకుంటున్నారు.
అసలు గొడవేంటి..?
జేడీఎస్ తరపున దేవెగౌడ కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ, చిన్న కొడుకు మాజీ సీఎం కుమారస్వామి, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇప్పుడు రేవణ్ణ భార్య భవానీ కూడా పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. హాసన నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో గొడవ మొదలైంది.
దేవెగౌడ చిన్నకోడలు అనిత కూడా రాజకీయ నాయకురాలే, ఆమె పోటీనుంచి తప్పుకుని కొడుకు నిఖిల్ కి అవకాశమిచ్చారు. ఇప్పుడు పెద్ద కోడలు కూడా రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. అందులోనూ ఆమె ఎంచుకున్న నియోజకవర్గమే ఇప్పుడు గొడవలకు మూలం. హాసన నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ కుమారుడు స్వరూప్ ని పోటీకి దించాలనుకుంటున్నారు కుమారస్వామి. ఆమేరకు ఆయన మాటిచ్చారు. ఇప్పుడు వదిన వచ్చి తనకు అదే సీటు కావాలంటుండే సరికి తల పట్టుకున్నారు. కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురం పోటీలో ఉన్నాం కదా, ఇంకొకరు ఎందుకని ప్రశ్నిస్తున్నారు కుమారస్వామి. కానీ భవానీ మాత్రం ససేమిరా అంటున్నారు.
ఒకవేళ భవానీకి హాసన నియోజకవర్గం ఇవ్వకపోతే, తాను అక్కడినుంచి పోటీ చేస్తానంటున్నారు ఆమె భర్త రేవణ్ణ. దీంతో అసలు ఈ సమస్య పోటీ కోసమా లేక, నియోజకవర్గం కోసమా అనేది అర్థం కావడంలేదు. ప్రస్తుతం దేవెగౌడ.. ఇద్దరు కొడుకులు, కోడలితో చర్చలు జరుపుతున్నారు. అవకాశం ఉంటే భవానీకి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని బుజ్జగిస్తున్నారు. అయితే ఆమె ససేమిరా అంటున్నారు. ఎన్నికల వేళ కుటుంబ గొడవ పార్టీపై ప్రభావం చూపిస్తుందేమోనని దేవెగౌడ ఇదైపోతున్నారు.