ప్రధానమంత్రి పంటల బీమా పథకం రైతుల కోసమా? కార్పోరేట్ల కోసమా?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకం ద్వారా కార్పోరేట్ బీమా కంపెనీలు ఈ ఐదేళ్ళలో 40,000 కోట్ల రూపాయలు సంపాదించాయి. ఈ వివరాలు కేం ద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో ప్రకటించింది.

Advertisement
Update:2022-07-27 11:56 IST

కేంద్రం ప్రవేశపెడుతున్న కొన్ని పథకాలు ప్రజల కోసమా కార్పోరేట్ కంపెనీల కోసమా అర్దం కాని పరిస్థితి. పథకం గురించి వింటే, దాని గురించి ప్రభుత్వం చేసే ప్రచారం చూస్తే ప్రజలకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా అని పిస్తుంది. లోతుల్లోకి వెళ్తే అసలు విషయాలు బహిర్గతమ‌వుతాయి.

కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(PMFBY)కు సంబంధించిన వివరాలను వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో ప్రకటించారు. ఆ డేటా చూస్తే అది రైతులకు ఉపయోగపడిందా లేక కార్పోరేట్ కంపెనీలకా అనేది స్పష్టంగా అర్దమవుతుంది.

ఈ పథకం ప్రారంభించిన 2016,17 నుండి 2021, 22 వరకు బీమా కంపెనీలకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం ప్రీమియం 1,59,132 కోట్ల రూపాయలు. ఇదే సమయంలో బీమా కంపెనీలు రైతులకు చెల్లించిన క్లెయిములు 1,19,314 కోట్ల రూపాయలు. అంటే 40,000 కోట్ల రూపాయలు బీమా కంపెనీలు ఆర్జించిన లాభం.

దేశంలో పంటల బీమా పథకం అమలు కోసం ప్రభుత్వం 18 సాధారణ బీమా కంపెనీలను ఎంప్యానెల్ చేసింది, అయితే వాటిలో నిర్దిష్ట బీమా కంపెనీలను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తాయి.

ప్రీమియంలో 2 శాతం రైతులు చెల్లిస్తే మిగతాది కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఇది రైతులకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ బీమా కంపెనీలకు మాత్రం లాభాల పంట పండించింది.

నిజానికి ఈ ఫసల్ బీమా పథకం కింద నమోదు చేసుకున్న రైతు, వర్షాలు, వరదలు, వడగళ్ళు లేదా వర్షాభావం కారణంగా పంట నష్టపోతే 72 గంటల్లో క్లయిమ్ చేయాలి. పంట నష్టానికి పరిహారం, బీమా కూడా రైతుకు చేరుతుంది. విత్తనం నుంచి కోత దశ వరకూ ఏ సందర్భంలో నష్టం వాటిల్లినా ఇది వర్తిస్తుంది. పంట నష్టం జరిగినట్టు నిర్ధారణ అయిన తర్వాత బీమా మొత్తంలో 25 శాతం రైతుల ఖాతాలో జమ చేయాలి. 14 రోజుల్లోగా మిగిలిన బీమా మొత్తం చెల్లించాలి.

అయితే ప్రీమియం కట్టిన రైతులకు కూడా తమకు పంట నష్టపరిహారం దక్కుతుందనే విషయం తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది క్లయిమ్ చేసుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తమ ప్రాంతం ఏ సాధారణ బీమా కిందకు వస్తుందనేది కూడా రైతుకు తెలియడం లేదు. అధికారులకు రైతులతో ప్రీమియం కట్టించడంలో ఉన్న ఇంట్రస్ట్ రైతు నష్టపోయినప్పుడు క్లెయిమ్ చేసుకునే విషయంలో వాళ్ళకు సహాయపడటంలో ఉండటం లేదు. 

బీమా కంపెనీలు కూడా క్లెయిమ్ చెల్లించే విషయంలో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చెల్లించకుండా ఉండటం కోసం ఏం చేయాలన్నదే వాటి మొదటి ప్రాధాన్యతగా ఉన్నది. దాంతో ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్పోరేట్ బీమా కంపెనీలకు వేల కోట్లు సంపాదించిపెట్టే పథకంగా తయారయ్యింది.

Tags:    
Advertisement

Similar News