అంబులెన్స్ లో డీజిల్ అయిపోయింది.. రోగి ప్రాణం పోయింది

అంబులెన్స్ ఆస్పత్రికి చేరకముందే ఆగిపోయింది. అంబులెన్స్ రిపేర్ వచ్చి ఆగిపోలేదు, అందులో డీజిల్ అయిపోయి ఆగిపోయింది.

Advertisement
Update:2022-11-26 16:42 IST

కరోనా కాలంలో ఆక్సిజన్ అందక రోగులు ఆస్పత్రి బెడ్స్ పైనే చనిపోయిన ఉదాహరణలు కోకొల్లలు. అప్పట్లో ఆక్సిజన్ కి అంత డిమాండ్ ఉండేది, తగిన సరఫరా లేక రోగులు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వాలు సర్ది చెప్పుకున్నాయి. కానీ, ఇప్పుడు రాజస్థాన్ లో ఓ అంబులెన్స్ లో డీజిల్ అయిపోవడంతో రోగి ప్రాణాలు కోల్పోయిన దౌర్భాగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చింది. సకాలంలో రోగిని ఆస్పత్రికి చేర్చి ప్రాణం కాపాడాల్సిన అంబులెన్సే చివరికి ఆ రోగి ప్రాణం పోయేందుకు కారణం అయింది. అంబులెన్స్ లో కాకుండా ఏ ప్రైవేట్ వాహనంలో ఎక్కినా ఆ రోగి బతికి ఉండేవాడేమో.

అసలేం జరిగిందంటే.. ?

రాజస్థాన్‌ లోని బాన్సువాడ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. 40 ఏళ్ల తేజ అనే వ్యక్తి దానాపూర్ గ్రామంలో కుమార్తె, అల్లుడితో కలసి ఉంటున్నాడు. అక్కడే ఆయన అల్లుడికి చెందిన పొలంలో పనికి వెళ్లాడు. పొలంలోనే ఆయన అపస్మారక స్థితిలో పడిపోగా, వెంటనే అల్లుడు ప్రభుత్వ అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ రావడంతో బాన్సువాడ జిల్లా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ విధి సహకరించలేదు. అంబులెన్స్ ఆస్పత్రికి చేరకముందే ఆగిపోయింది. అంబులెన్స్ రిపేర్ వచ్చి ఆగిపోలేదు, అందులో డీజిల్ అయిపోయి ఆగిపోయింది.

దానాపూర్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ బాన్సువాడకు 10 కిలోమీటర్ల దూరంలోని రత్లాం రోడ్‌ టోల్‌ ప్లాజా సమీపంలో ఆగిపోయింది. రోగి బంధువులు ఆందోళనతో డ్రైవర్ ని కారణం ఏంటని అడిగారు. అతను చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయారు. అంబులెన్స్ లో డీజిల్ అయిపోయిందని చావు కబురు చల్లగా చెప్పాడు డ్రైవర్. దీంతో వెంటనే మరో వ్యక్తికి డీజిల్ తేవాలని ఫోన్ చేశారు ఆ రోగి బంధువులు. ఈలోగా అంబులెన్స్ ని కిలోమీటర్ మేర తోసుకెళ్లారు. ఇంతలో డీజిల్ తెచ్చి అంబులెన్స్ లో నింపారు. కానీ అది స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత మరో గంటకు వేరే అంబులెన్స్ తీసుకు రావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను కొనప్రాణాలతో కొట్టుకుంటున్నాడు. ఆస్పత్రికి చేరే సరికి అతని ప్రాణం పోయింది. అంబులెన్స్ లో డీజిల్ లేకపోవడం వల్లే ప్రాణం పోయిందని రోగి బంధువులు ఆందోళనకు దిగారు.

Tags:    
Advertisement

Similar News