సూట్‌కేసులో కింగ్ కోబ్రాలు, కోతులు.. - బ్యాంకాక్ నుంచి తరలిస్తుండగా బెంగళూరులో పట్టివేత
20 వరకు విషపూరిత కింగ్ కోబ్రాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు 55 ఇతర పాములు, 6 కోతులు ఉన్నాయి. నిందితుడు తన లగేజీలోని సూట్‌కేసుల్లో వాటిని తరలిస్తున్నాడు.
బ్యాంకాక్ నుంచి వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. బ్యాంకాక్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈనెల 6వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఏసియా విమానంలో నిందితుడు బెంగళూరుకు వచ్చాడు. తనిఖీలు చేపట్టగా.. నిందితుడి లగేజీలో ఏకంగా 78 వన్యప్రాణులు లభించాయి. వాటిలో 20 వరకు విషపూరిత కింగ్ కోబ్రాలు కూడా ఉన్నాయి. దీంతో వాటిని చూసి ఒక్కసారిగా విమానాశ్రయ సిబ్బంది, కస్టమ్స్ అధికారులు భయపడిపోయారు. వాటితో పాటు 55 ఇతర పాములు, 6 కోతులు ఉన్నాయి. నిందితుడు తన లగేజీలోని సూట్‌కేసుల్లో వాటిని తరలిస్తున్నాడు.
నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు వన్యప్రాణులను సంరక్షణ కేంద్రానికి తరలించారు. గత నెలలో కూడా 250కి పైగా బల్లులు, పాములు, ఒక కంగారూ పిల్లతో కూడిన జీవులను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. తాజా ఘటనతో బెంగళూరు విమానాశ్రయం కేంద్రంగా వన్య జీవుల స్మగ్లింగ్ ముఠాలు ఈ కార్యకలాపాలకు పాల్పడున్నట్టు తెలుస్తోంది. దీనిపై లోతైన విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.