ప్రపంచ కప్ ఫైనల్‌కు భారీ భద్రత.. - 6 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది మోహరింపు
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల మోహరించి ఉంటుందని చెప్పారు. నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండటంతో సర్వత్రా ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు లక్ష మందికి పైగా అభిమానులు తరలివస్తున్నారు. మరోపక్క ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా రానున్నారు. దీంతో స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 6 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని స్టేడియంలో మోహరించినట్టు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
భద్రతా సిబ్బందిలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, హోంగార్డులు, ఇతర సిబ్బంది ఉంటారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఈ మెగా ఈవెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 6 వేల మంది సిబ్బందిలో దాదాపు 3 వేల మంది స్టేడియం లోపల ఉంటారని వివరించారు. మరికొందరు సిబ్బంది.. ఆటగాళ్లు, ప్రముఖులు బస చేస్తున్న హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలలో బందోబస్తు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల మోహరించి ఉంటుందని చెప్పారు. నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. వీరికి 39 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 92 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు సహాయం చేస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఆయన బాంబ్ బెదిరింపులపై స్పందిస్తూ.. ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఆకతాయిగా చేసే బెదిరింపులను మీడియా హైలైట్ చేయొద్దని కోరారు.