ఆలస్యంగా నడుస్తున్న 200 పైగా విమానాలు
పొగమంచు కారణంగా 19 విమానాల దారి మళ్లింపు.. 30 విమానాల రద్దు
చలి తీవ్రతతో ఉత్తరభారతం వణుకుతున్నది. ఢిల్లీ, చండీగఢ్, అమృత్‌సర్, ఆగ్రా, పాలెం విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీతో సమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 19 విమానాలను దారి మళ్లించారు. మరో 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ 3 విమానాలు మినహా మిగతా విమానాల ల్యాండింగ్‌కు టేకాఫ్ కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా విమానాల రాకపోకల ప్రభావం పడుతున్నదని చెప్పారు. విమానాల సమయం కోసం ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత విమానాశ్రయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. అటు రైళ్లు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. మంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే దాదాపు 50పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రిపబ్లిక్ పరేడ్ కోసం భద్రతా బలగాలు పొగ మంచులోనే రిహాల్సర్స్ నిర్వహించాయి.
ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనవరి 8వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచుకురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. మధ్యలో తేలికపాటు వర్షాలు పడవచ్చని తెలిపింది.