ఆ విషయాన్ని బీజేపీ-కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించాలి

కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కేజ్రీవాల్‌ ఎద్దేవా

Advertisement
Update:2025-01-04 16:08 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేతఅరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు.

పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ ఆ రాష్ట్రానికి చెందిన కొందరు మహిళలు పార్టీ అధినేత కేజ్రీవాల్‌ నివాసం ముందు నిరసన తెలిపారు. దీనిపై ఆయన స్పందించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు కావాలనే కూటమిగా ఏర్పడి మాపై దాడి చేస్తున్నాయి. ఆ మహిళలు వారి పార్టీలకు చెందినవారే. వారు పంజాబ్‌ నుంచి రాలేదు. ఆ రాష్ట్ర ప్రజల మద్దతు మాకే ఉన్నది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌పై పోటీ చేస్తున్నట్లు బీజేపీ-కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించాలి. కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్‌ ప్రకటించనప్పటికీ... ఇప్పటికే అన్నిపార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్‌ వర్మను బీజేపీ బరిలోకి దింపింది. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియనున్నది. మరికొన్ని రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ మొత్తం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్‌ కూడా కొంతమంది పేర్లను ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News