మా విధానాలతో గ్రామీణ పేదరికం తగ్గింది

గ్రామీణ భారత మహోత్సవం 2025 కార్యక్రమంలో ప్రధాని వ్యాఖ్యలు

Advertisement
Update:2025-01-04 15:45 IST

దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని.. అటువంటి గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం 2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువయ్యాయన్నారు. ఫలితంగా పట్టణాల్లోనూ పేదరికం పెరిగిందని ప్రధాని వాపోయారు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య అంతరం పెరుగుతూనే ఉన్నదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ప్రస్తుతం తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. సమాజ సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలు గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయన్నారు. మారుమూల గ్రామాల ప్రజలను దేశాభివృద్ధిలో భాగం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి సమ్మిళిత ఆర్థిక విధానాలు అవసరమని పేర్కొన్నారు.

కొవిడ్‌ సమయంలో భారత్‌లోని మారుమూల ప్రాంతల ప్రజలు ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటారని ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేసినట్లు మోదీ పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నదన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో దేశంలోని అత్యుత్తమ డాక్టర్లు ఆస్పత్రులను గ్రామాలను అనుసంధానించామని వెల్లడించారు. గ్రామల్లోని ప్రజలు ప్రస్తుతం టెలీమెడిసిన్‌ సౌకర్యాలను కూడా పొందుతున్నారన్నారు.

పల్లెల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు, మౌలిక వసతులు అందిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. పీఎం-కిసాన్‌ పథకం కింద, కేంద్రం రైతులకు రూ. 3 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నదని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలవల్ల గ్రామీణ భారతంలో పేదరికం సుమారు 26 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News