రాజ్‌భవన్ - కర్తవ్య భవన్.. రాజస్థాన్ - కర్తవ్యస్థాన్..
రాజ్ పథ్ పేరుని మార్చేసిన బీజేపీ, రాజస్థాన్ పేరుని కూడా కర్తవ్యస్థాన్ గా మార్చాలంటూ సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత శశిథరూర్. మిగతా ప్రాంతాలు ఏం పాపం చేశాయని ప్రశ్నించారు.
అది బ్రిటీష్ సంప్రదాయం అంటూ ఇటీవల రాజ్ పథ్ పేరుని కర్తవ్య పథ్ గా మార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఈ పేరు మార్పు ఇక్కడే మొదలు కాలేదు. తమకు నచ్చని పేర్లన్నింటినీ మార్చుకుంటూ వెళ్తోంది బీజేపీ. ఆ కోవలో ఇది లేటెస్ట్ పేరుమార్పు అంతే. అయితే ఇక్కడే కేంద్రానికి పెద్ద చిక్కొచ్చి పడింది. రాజ్ అనే పథంలో బ్రిటీషర్ల అజమాయిషీ కనిపిస్తే.. మరి అన్నింట్లోనూ ఆ పదం ఉండకూడదు కదా అని లాజిక్ తీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్ల అధికారిక నివాసాలను రాజ్ భవన్ గా కాకుండా కర్తవ్య భవన్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజస్థాన్ కి కూడా ముప్పొచ్చిందా..?
రాజ్ పథ్ పేరుని మార్చేసిన బీజేపీ, రాజస్థాన్ పేరుని కూడా కర్తవ్యస్థాన్ గా మార్చాలంటూ సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత శశిథరూర్. రాజ్ పథ్ పేరును మార్చడాన్ని ఆయన ఆక్షేపించారు. అదే సమయంలో మిగతా ప్రాంతాలు ఏం పాపం చేశాయని ప్రశ్నించారు. రాజ్ భవన్, రాజస్థాన్ పేరు కూడా మార్చాల్సిందేనంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
రాజధాని ఎక్స్ ప్రెస్ పేరు కూడా..
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించారు. రాజ్ భవన్ లను ఇకపై కర్తవ్య భవన్ లుగా వ్యవహరిస్తారా అని అడిగారు మహువా మొయిత్రా. ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ నవ్వులు పూయించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్ గా వస్తున్న మంగళ్ పాండే.. కర్తవ్యధాని ఎక్స్ ప్రెస్ లో తన కర్తవ్య కచోరీలను ఆస్వాదిస్తూ మంచి తీపి కర్తవ్య భోగ్ ని ఆస్వాదించొచ్చు అంటూ ఆమె ట్వీట్ చేశారు. రాజధాని ఎక్స్ ప్రెస్ పేరుని కూడా కర్తవ్యధాని ఎక్స్ ప్రెస్ గా మార్చేస్తారేమోనంటూ ఆమె సెటైర్లు వేశారు.