సుప్రీంకోర్టుపై కూడా ఆశలు సన్నగిల్లాయి.. సీనియర్ లాయర్ కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు

సుప్రీం కోర్టుపై కూడా ఆశలు సన్నగిల్లాయని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చినా అది క్షేత్ర స్థాయిలో మార్పును తీసుకరావడంలేదని ఆయన అన్నారు.

Advertisement
Update:2022-08-08 17:58 IST

సుప్రీంకోర్టుపై రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కోర్టు తీసుకున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన.. ఈ అత్యున్నత న్యాయస్థానం పట్ల తనకు ఆశలు సన్నగిల్లాయని చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి మీకు ఊరట లభిస్తుందని అనుకుంటే మీరు పూర్తిగా పొరబడినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. 'ఈ కోర్టులో 50 ఏళ్లుగా ప్రాక్టీస్ పూర్తి చేసిన అనంతరం ఈ మాటలంటున్నా' అన్నారు. 'సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చినా అది క్షేత్ర స్థాయిలో మార్పును తీసుకురావడమన్నది చాలా అరుదు..ఈ కోర్టు ఇచ్చే తీర్పుల గురించి ప్రజలు, ప్రముఖులు మాట్లాడుకొంటుంటారు.. కానీవాటికి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు మధ్య చాలా తేడా ఉంది' అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ప్రైవసీపై ఈ కోర్టు తీర్పునిస్తుందని, కానీ ఈడీ అధికారులు మీ ఇంటికొస్తారని, ఇక మీ ప్రైవసీ ఎక్కడ అని అన్నారు.

'జుడిషియల్ రోల్ బ్యాక్ ఆఫ్ సివిల్ లిబర్టీస్' (పౌర హక్కుల పై న్యాయవ్యవస్థ వెనుకంజ) అన్న అంశంపై ఢిల్లీలో మూడు సంస్థలు ఈ నెల 6 న నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. (క్యాంపెయిన్ ఫర్ జుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫామ్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్ అనే సంస్థలు దీన్ని నిర్వహించాయి.) కీలకమైన కొన్ని కేసులను కొద్దిమంది జడ్జీలకే కేటాయిస్తుంటారని, తీర్పు ఎలా ఉంటున్నదన్నది సహజంగానే ..ముందే లీగల్ నిపుణులకు తెలిసిపోతుందని కపిల్ సిబల్ చెప్పారు. 50 ఏళ్లుగా తాను పాక్టీస్ చేసిన కోర్టు గురించి ఇలా మాట్లాడకూడదని, కానీ ఇప్పుడు సమయం వచ్చిందని అన్నారు. నేను మాట్లాడకపోతే మరి ఇంకెవరు మాట్లాడతారు అని ప్రశ్నించారు. రాజకీయంగా సెన్సిటివ్ కేసు ఏదైనా ఉంటే ఆ కొద్దిమంది జడ్జీల ముందే పెడతారని, దాని తీర్పు గురించి మనకు ముందే తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఏ కేసును ఏ బెంచ్ విచారిస్తుందో తెలియదు.. ఏ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడు నిర్ణయిస్తారో తెలియదు.. ఇక్కడ రాజీ మార్గం ద్వారా న్యాయమూర్తుల సంస్థాగత ప్రక్రియ కొనసాగుతోంది అని కపిల్ వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఈ కోర్టు స్వతంత్రంగా పని చేస్తుందా అన్నారు. ప్రజలు తమ మైండ్ సెట్ మార్చుకోకపోతే పరిస్థితి కూడా మారదన్నారు.

ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడంపై కపిల్ సిబల్ అసంతృప్తి

2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి, మరికొంతమందికి 'సిట్' క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దివంగత మాజీ ఎంపీ ఎహ్ సాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ఆయన విమర్శించారు. జకియా జఫ్రీ పిటిషన్ ని కొట్టివేసిన తరువాత సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ని అరెస్టు చేశారని, ఆమెకు సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలూ జరగలేదని .. పైగా కోర్టు ఆమె పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. పైగా మనీలాండరింగ్ చట్టం సక్రమమే అన్న కోర్టు నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ చట్టం కింద ఈడీకి గల విస్తృత అధికారాలను కోర్టు సమర్థించిందన్నారు. ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్ల ఏరివేతలో భాగంగా భద్రతా దళాలు 17 మంది గిరిజనులను పట్టుకొచ్చి హతమార్చిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుతూ 2009 లో దాఖలైన పిటిషన్ ని కూడా కోర్టు కొట్టివేసిందన్నారు. ఈ కేసులకు సంబంధించిన నిర్ణయాలనన్నీ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ తీసుకున్నదని ఆయన గుర్తు చేశారు. జకియా జఫ్రీ తరఫున, మనీలాండరింగ్ చట్టంలోని కొన్ని సెక్షన్లను సవాలు చేసిన కొందరు పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ లోగడ కోర్టులో వాదించారు.

ఇండియాలో 'మాయీబాప్' కల్చర్ ఉందని, పవర్ ఫుల్ నేతల కాళ్లపై ప్రజలు పడతారని, కానీ ప్రజలిప్పుడు ముందుకు వచ్చి తమ హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. మన సొంత హక్కుల కోసం మనం నిలబడినప్పుడే స్వాతంత్య్రం అన్నది సాధ్యపడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా కపిల్ సిబల్ వ్యాఖ్యలను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఖండించారు. మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కపిల్ సిబల్ ప్రశ్నించారని, కానీ లోగడ యూపీఏ హయాంలో తాను (సిబల్) మంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టం వచ్చిందని మాలవీయ అన్నారు. 'చీఫ్ జస్టిస్ అధికారాలను కూడా సిబల్ ప్రశ్నించారు.. అలాగే అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన ఇతర తీర్పుల గురించి కూడా ప్రస్తావించారు.. సుప్రీంకోర్టు ఆయనపై కోర్టు ధిక్కార చర్య తీసుకొంటుందా' అని మాలవీయ వ్యాఖ్యానించారు. ఇక కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది అని, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తాను ఆశ్చర్యపోయానని రాజ్యసభ ఎంపీ, మరో సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ అన్నారు. తీర్పులను విమర్శించవచ్చు గానీ సంస్థలను దిగజార్చరాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News