దల్లేవాల్‌కు వైద్య సహాయం.. ప్రభుత్వానికి సుప్రీం మరింత సమయం

తదుపరి విచారణను జనవరి 2కు వాయిదా

Advertisement
Update:2024-12-31 13:52 IST

రైతుల డిమాండ్ల సాధన కోసం రైతు నాయకుడు జగ్జీత్ సింగ్‌ దల్లేవాల్‌ 36 రోజులుగా నిరవధిక నిరశన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తగిన వైద్య సహాయం అందజేయాలని డిసెంబర్‌ 20న సుప్రీంకోర్టు పంజాబ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించడానికి తమకు మరింత గడువు కావాలని ప్రభుత్వం కోరడంతో.. అందుకు అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 2కు వాయిదా వేసింది. దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చింది.

పంటల కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్‌ 26 నుంచి జగ్జీత్ సింగ్‌ దల్లేవాల్‌ పంజాబ్‌-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. దీంతో రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్య సహాయం అందించాలని సుప్రీంకోర్టు అక్కడి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దల్లేవాల్‌కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయని, కనీసం ఐవీ ఫ్లూయిడ్స్‌నైనా ఇప్పించడానికి అవకాశం లేదని పంజాబ్‌ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తంచేసింది.

బలవంతంగా తరలిస్తే ఇరువైపులా ప్రాణనష్టం తప్పకపోవచ్చని వివరించింది. దీనికోసం మరింత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. ప్రభుత్వం విన్నపరం మేరకు కోర్టు మరో మూడు రోజుల సమయం ఇచ్చిందని పంజాబ్‌ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ గుర్మిందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న రైతులతో అధికారులు చర్చలు జరుపుతున్నారని.. దల్లేవాల్‌ను సమీపంలోని తాత్కాలిక ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Tags:    
Advertisement

Similar News