రాహుల్ మాపై బౌన్సర్‌లా వ్యవహరించారు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి
పార్లమెంటు ఆవరణలో డిసెంబర్ 19న ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడిన వారిలో ఒకరైన ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారని మండిపడ్డారు.
అటల్ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్‌సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారని.. అలాంటి పదవిలో కొనసాగుతున్న రాహుల్ ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. తోపులాటలో గాయపడిన తాను డిసెంబర్ 28 ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నదని, తలపై పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారంటూ విపక్షాలు ఆందోళన చేశాయి. ఆ సమయంలో కాంగ్రెస్సే రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తున్నదంటూ మకరద్వారం మెట్లపై నిల్చొని డిసెంబర్ 19న పార్లమెంటు ప్రారంభం కావడానికి ముందు ఎన్డీఏ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో విపక్ష ఎంపీలూ నిరసనకు దిగారు. ఆ సమయంలోనే రాహుల్ గాంధీ తమను తోసుకుంటూ సభలోకి వెళ్లడానికి యత్నించారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాస్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడ్డారు