అన్నా వర్సిటీలో అత్యాచార ఘటన.. బీజేపీ నిరసన ర్యాలీ

మదురై నుంచి చైన్నై వరకు సుమారు 450 కి.మీల మేర ర్యాలీ చేపట్టనున్నట్లు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై వెల్లడి

Advertisement
Update:2024-12-31 17:46 IST

అన్నా వర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. బాధితురాలికి న్యాయం చేయడానికి పార్టీ మహిళా విభాగంఆధ్వర్యంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మదురై నుంచి చైన్నై వరకు సుమారు 450 కి.మీల మేర ర్యాలీ చేపట్టనున్నట్లు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై వెల్లడించారు. ఈ కేసులో నిందితులు డీఎంకేకు చెందినవారని, అందుకే ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మహిళలపై అకృత్యాలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఉమరాతి రాజన్‌ ఆధ్వర్యంలో ఈ న్యాయ ర్యాలీ జనవరి 3న ప్రారంభం కానున్నది. ఈ ర్యాలీ చెన్నైకి చేరుకున్న అనంతరం మహిళా విభాగం తమ డిమాండ్లపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేయనున్నదని అన్నామలై తెలిపారు. అన్నావర్సిటీలోని క్యాంపస్‌లో ఇటీల 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ దారుణ ఘటనపై విపక్షాలతో పాటు పౌర సమాజం నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు అధికార డీఎంకేకు చెందిన వ్యక్తి అంటూ పలువురు చేస్తున్న ఆరోపణలు ఆపార్టీ ఖండించింది.

మరోవైపు, తమిళనాడులో డీంకే ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడం లేదని అన్నామలై ఆరోపిస్తున్నారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఇటీవల ఆయన కోవైలో తన ఇంటి ఎదుట కొరడా తో కొట్టుకుంటూ నిరసన తెలిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు చెప్పులు వేసుకోనంటూ ఆయన శపథం చేశారు. 

Tags:    
Advertisement

Similar News