పటేల్ సాక్షిగా మోడీ ఐక్యతా ప్రమాణం..
దేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు. నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్రమోడీ
స్వతంత్ర భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు. పటేల్ విగ్రహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన ఐక్యతా దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఐక్యతా ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 'దేశంలో గందరగోళం సృష్టించడానికి బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ప్రగతికి అడ్డుగోడలా ఉందనే జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలిగించాం. ఉమ్మడి పౌర స్మృతి దిశగా అడుగులు వేస్తున్నాం. ఐదు భాషలకు ప్రాచీన హోదా ఇచ్చాం. ఇవాళ ప్రభుత్వం చేసే ప్రతి పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఐక్యతా విగ్రహం ఉన్నది. దీని నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా రైతుల నుంచి పొలాల్లో వాడే పరికరాల లోహాన్ని సేకరించి ఇక్కడికి తీసుకొచ్చాం. దేశంలోని ప్రతి మూల నుంచి ఇక్కడికి మట్టిని తీసుకొచ్చాం. ఇక్కడ ఏక్తా నర్సరీ ఉన్నది. విశ్వవనం ఉన్నది. దీనిలో ప్రపంచంలోని చాలా అడవుల నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఏక్తా మాల్‌లో దేశంలోని హస్తకళలు అమ్మకానికి ఉన్నాయి. ప్రతి రాష్ట్ర రాజధానిలో ఇలాంటి మాల్స్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నాం. దేశంలో రైలు, రోడ్లు, హైవే, ఇంటర్నెట్ వంటి ఆధునిక ఇన్ ఫ్రా గ్రామాలు పట్టణాలతో అనుసంధానమయ్యాయి. కశ్మీర్ ఈశాన్య భారతం రైలుతో దేశానికి కనెక్ట్ అయ్యాయి. గత ప్రభుత్వం నీతి, నిబద్ధతల్లో వివక్ష భావాలు దేశ సమైక్యతను దెబ్బతీశాయి. గత పదేళ్లలో వివక్షను తొలిగించడానికి నిర్విరామకంగా పనిచేశాం. 'హర్‌ఘర్ జల్' స్కీమ్‌తో ప్రతి ఇంటికి నీరు అందించాం. ఆయుష్మాన్ భారత్ వల్ల ప్రతి వ్యక్తి లబ్ధి పొందుతాడు. దశాబ్దాలుగా ఉన్న అసంతృప్తిని ఇది తొలిగించింది. మా ప్రతి స్కీమ్‌లో, ప్రతి విధానంలో, ప్రతి నిబద్ధతలో ఐకమత్యమే ప్రాణశక్తి. దీనిని చూసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆత్మ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది' అని పేర్కొన్నారు.
తర్వాత రాష్ట్రీయ ఏక్తాదివస్ పరేడ్ నిర్వహించారు. ఇందులో సైనిక బలగాలు చేసిన విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన పోలీసులు, నాలుగు కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఎన్‌సీసీ బృందం ఈ పరేడల్‌లో మార్చ్ చేశారు. సీఆర్పీఎఫ్ మహిళ, పురుష సిబ్బంది బైక్‌లతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విన్యాసాలను ప్రధాని మోడీ ప్రత్యక్షంగా వీక్షించి సాయుధ దళాలకు సెల్యూట్ చేశారు. అంతకుముందు పటేల్ విగ్రహంపై భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం పూలవర్షం కురిపించింది.
కేంద్రంల మోడీ నేతృత్వంలో 2014లో అధికారంలోకి వచ్చాక నాటి నుంచి పటేల్ జయంతిని 'జాతీయ ఐక్యతా దినం' పేరుతో వేడుకగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2018లో గుజరాత్‌లోని కేవడియా ప్రాంతంలో పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తులో ఉండే ఈ విగ్రహం.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా గుర్తింపు పొందింది.