పేరులో ఇండియా ఉంటే సరిపోతుందా..? మోదీ వెటకారం
మణిపూర్ అల్లర్లకు అడ్డుకట్ట వేయలేక, కనీసం సమాధానం చెప్పలేక మోదీ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రస్టేషన్ ని ఇలా ప్రతిపక్షాలపై తీర్చుకుంటున్నారు. పార్లమెంట్ లో జరుగుతున్న ఆందోళనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈస్టిండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదిన్.. ఆయా పేర్లలో కూడా ఇండియా అనే పదం ఉందని... భారత్ లో ప్రతిపక్ష కూటమి 'ఇండియా' అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోతుందా అని వెటకారం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. పార్లమెంట్ ఉభయ సభల్లో జరుగుతున్న ఆందోళనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీలు తమ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను తానింతవరకు చూడలేదన్నారు మోదీ. ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకోవడం లేదని, ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. దేశ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఇండియా అనే పదాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించాయని అన్నారు మోదీ.
మణిపూర్ గొడవపై సమాధానం చెప్పలేకే..
మణిపూర్ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. పార్లమెంట్ లో మోదీ ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయ సభలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ అల్లర్లకు అడ్డుకట్ట వేయలేక, కనీసం సమాధానం చెప్పలేక మోదీ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రస్టేషన్ ని ఇలా ప్రతిపక్షాలపై తీర్చుకుంటున్నారు మోదీ. పార్లమెంట్ లో జరుగుతున్న ఆందోళనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.