ఆ కామాంధుడికి 150 ఏళ్ల జైలుశిక్ష.. - కేరళ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు

కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కలికావు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Advertisement
Update:2024-01-26 08:09 IST

కేరళ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు కీచక తండ్రి (42)కి 150 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మైనర్‌ అయిన కన్న కూతురిపై పదేపదే అఘాయిత్యానికి ఒడిగట్టిన ఆ కామాంధుడికి మున్నెన్నడూ ఎరుగని శిక్ష విధించింది. 2022లో ఈ దారుణం జరగగా, దీనిపై విచారణ చేపట్టిన పెరింతల్మన్న ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు–2 తాజాగా ఈ తీర్పు వెలువరించింది.

కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కలికావు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దోషికి ముగ్గురు భార్యలు కాగా.. అందులో ఒక భార్య కుమార్తెపై ఈ కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు పదేపదే ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టినట్టు వెల్లడించారు. ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు.. అతనిపై నేరం రుజువు కావడంతో పోక్సో, ఐపీసీ, జువైనల్‌ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది.

శిక్షలు ఇలా...

పదే పదే చిన్నారిపై లైంగిక దాడి పాల్పడినందుకు, కుటుంబసభ్యుడే అత్యాచారానికి పాల్పడిన నేరానికి పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 40+40 ఏళ్లు చొప్పున న్యాయస్థానం శిక్ష విధించింది. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఐపీసీ 376 (3) కింద 30 ఏళ్లు, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 4(2) కింద 30 ఏళ్లు శిక్ష ఖరారు చేసింది. ఇంకా.. జువైనల్‌ యాక్ట్‌ కింద గృహంలోకి అక్రమంగా చొరబడినందుకు 7 సంవత్సరాలు, చిన్నారిపై క్రూరంగా వ్యవహరించినందుకు మూడేళ్లు కలిపి 10 సంవత్సరాల శిక్ష విధించింది. అలాగే జరిమానా కింద రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ.2 లక్షలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. పైన పేర్కొన్న శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. దీంతో శిక్షల్లో అతి పెద్దదైన 40 ఏళ్ల జైలు శిక్ష అతడికి వర్తిస్తుందని న్యాయస్థానం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ఆర్డర్‌ కాపీలో పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News