6 నెలలు అనుకుంటే 8 ఏళ్లు పనిచేసింది..
ఇంధనం పూర్తిగా అయిపోవడం, బ్యాటరీ డెడ్ అవడంతో ఉపగ్రహంతో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. మంగళ్ యాన్ ప్రాజెక్ట్ కాలపరిమితి పూర్తయింది.
అంగారక గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన అరుదైన ఘనతను ఆనాడు భారత్ సొంతం చేసుకుంది. ఆ ప్రయోగం అంతకు వందరెట్లు సంతోషాన్ని మిగిల్చింది. 6 నెలల కాలపరిమితితో ప్రయోగించిన అంగారక ఉపగ్రహం ఎనిమిదేళ్లపాటు పనిచేసింది. చివరికి ఇప్పుడు దాని సుదీర్ఘ పరిశోధనలకు తెరపడింది. ఇంధనం పూర్తిగా అయిపోవడం, బ్యాటరీ డెడ్ అవడంతో ఉపగ్రహంతో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. మంగళ్ యాన్ ప్రాజెక్ట్ కాలపరిమితి పూర్తయింది. ఈ రిటైర్మెంట్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రాజెక్ట్ కీలక అంశాలు..
450 కోట్ల రూపాయల ఖర్చుతో మంగళ్ యాన్ ప్రాజెక్ట్ చేపట్టారు.
2013 నవంబరు 5న PSLV-C25 రాకెట్ ద్వారా ప్రయోగం.
2014 సెప్టెంబరు 24న విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశం.
6నెలలపాటు పనిచేసేలా రూపకల్పన..
ఇప్పటి వరకు ఈ ఉపగ్రహం 8వేలకు పైగా అంగారక ఫొటోలను చిత్రీకరించి పంపించింది. 6 నెలలు పనిచేస్తుంది అనుకున్న ఉపగ్రహం 8 ఏళ్లపాటు విజయవంతంగా పనిచేసింది. సోలార్ ప్యానెల్స్ ద్వారా బ్యాటరీలు రీఛార్జ్ అవుతున్నంత సేపు ఉపగ్రహం పనితీరు బాగానే ఉంది. కానీ ఇప్పుడు బ్యాటరీలు డెడ్ అయ్యాయి. వాటిని రీచార్జ్ చేయడానికి కూడా కుదరని పరిస్థితి. అందుకే సిగ్నల్స్ ఆగిపోయాయి.
ఎందుకిలా..?
అంతరిక్షంలో నిరంతరం సూర్యకాంతి లభించదు. అందులోనూ ఈ ఉపగ్రహం అంగారక గ్రహం చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. అందువల్ల అంగారక గ్రహానికి గ్రహణం పట్టినప్పుడు ఈ ఉపగ్రహానికి సూర్యకాంతి అందదు. అంటే సోలార్ ప్యానెల్స్ కి సౌరశక్తి అందదు. ఈ గ్రహణాలను తప్పించుకోడానికి పలుమార్లు దీని కక్ష్యను మార్చారు. దీనికోసం ఉపగ్రహంలో ఉన్న ఇంధనాన్ని వాడుకున్నారు. ఈ ఇంధనం కూడా అయిపోవడంతో కక్ష్యమార్చడం కుదర్లేదు. ఇటీవల ఏడున్నర గంటలపాటు ఏకధాటిగా అంగారకుడికి గ్రహణం పట్టడంతో ఉపగ్రహానికి సూర్యకాంతి అందక బ్యాటరీలు కూడా డెడ్ అయ్యాయి. దీంతో భూమితో ఈ ఉపగ్రహానికి సంబంధాలు తెగిపోయాయి.