రోడ్డు లేదు, బ్రిడ్జ్ లేదు.. కానీ ఆ ఊరికి రెండు హెలిప్యాడ్ లు

సతారా జిల్లాలోని కిర్ఖిండి గ్రామం ఇప్పుడిలా వార్తల్లో నిలిచింది.

Advertisement
Update:2022-07-14 19:52 IST

వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సొంత ఊరికి రెండు హెలిప్యాడ్ లు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాక ముందునుంచీ అక్కడ హెలిప్యాడ్ లు ఏర్పాటు చేశారు. ఆ ఊరినుంచి జిల్లా కేంద్రం సతారాకు వెళ్లడానికి మాత్రం రోడ్డు లేదు. ఊరి పక్కనే ఉన్న డ్యామ్ దాటడానికి కనీసం బ్రిడ్జ్ కూడా లేదు. సతారా జిల్లాలోని కిర్ఖిండి గ్రామం ఇప్పుడిలా వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆ గ్రామంలోని బాలికల కష్టాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. చదువుకోడానికి వారంతా సతారాకు వెళ్లాలి. కానీ సరైన రోడ్డు మార్గం లేదు, డ్యామ్ దాటాలంటే బ్రిడ్జ్ కూడా లేదు. దీంతో వారి బాధల్ని మీడియాకు చెప్పుకున్నారు. ఆ కథనాన్ని బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. చివరకు విచారణలో తేలిందేంటంటే.. ఆ ఊరికి రెండు హెలిప్యాడ్ లు ఉన్నాయి. కానీ రోడ్డు, బ్రిడ్జ్ లేకపోవడం విచిత్రం.

సీఎం ఏక్ నాథ్ షిండే ఊరికి ఎన్ని హెలిప్యాడ్ లు ఉన్నా తమకు అభ్యంతరం లేదని, కానీ ఇప్పుడైనా ఆ ఊరికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు జస్టిస్ వర్లే. కోయన్ డ్యామ్ బ్యాక్ వాటర్ వల్ల నిత్యం ఆ ఊరి చుట్టూ వరదనీరు ఉంటుంది. విద్యార్థుల కష్టాలు మీడియాలో హైలెట్ కావడంతో ఏక్ నాథ్ షిండే కుమారుడు లోక్ సభ సభ్యుడు అయిన శ్రీకాంత్ ఓ పడవను వారికోసం ఇచ్చారు. అయితే అది సరిపోదని వారికి కచ్చితంగా బ్రిడ్జ్ నిర్మించాలని సూచించారు జస్టిస్ వర్లే.

కోయన్ డ్యామ్ వల్ల నిర్వాసితులైన చాలామందిని థానే జిల్లాలోని భిన్వాడికి తరలించారు. అయితే కొందరు మాత్రం పునరావాసం తమకు వద్దన్నారు. తాము కిర్ఖిండిలోనే ఉంటామని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అధికారికంగా మునిగిపోయే గ్రామాలన్నిటినీ బలవంతంగా ఖాళీ చేయించారు. అయితే కిర్ఖిండికి మాత్రం పునరావాస ప్యాకేజీ లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం అయ్యాడు కాబట్టి, ఇప్పటికైనా తమ కష్టాలు తీరతాయేమోనని ఆశపడుతున్నారు గ్రామస్తులు. విద్యార్థినుల కష్టాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన కోర్టు.. చీఫ్ సెక్రటరీని దీనిపై వివరణ అడిగింది. సత్వరమే ఆ సమస్యపై స్పందించాలని, సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించింది.

Tags:    
Advertisement

Similar News