మహారాష్ట్రలో ఒక విడత.. జార్ఖండ్‌ లో రెండు విడతల్లో ఎన్నికలు

మహారాష్ట్ర పోలింగ్‌ నవంబర్‌ 20న.. జార్ఖండ్‌ లో నవంబర్‌ 13, 20 తేదీల్లో ఎన్నికలు : సీఈసీ

Advertisement
Update:2024-10-15 16:17 IST

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సందు మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జార్ఖండ్‌ మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ జరనుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు గాను 234 సీట్లు జనరల్‌ కాగా, 25 ఎస్టీ, 29 ఎస్సీ రిజర్వుడ్‌ సీట్లు ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 22న జారీ చేస్తారు. ఆ రోజు నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. 30 నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. నామినేషన్‌ల ఉప సంహరణకు నవంబర్‌ నాలుగో తేదీ వరకు అవకాశం ఇచ్చారు. నవంబర్‌ 20న పోలింగ్‌ నిర్వహిస్తారు. 23న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ నాడు ప్రకటించిన ఎలక్టోరల్‌ రోల్స్‌ ప్రకారం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళలు. ఎన్నికల కోసం 1,00,186 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ప్రకటించారు.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో మొదటి విడత (నవంబర్‌ 13న) పోలింగ్‌ నిర్వహించే నియోజకవర్గాలకు ఈనెల 18న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. 28న నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. 30వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. 13న పోలింగ్‌ నిర్వహిస్తారు. రెండో విడత ఎన్నికల కోసం ఈనెల 22న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు నవంబర్‌ ఒకటో తేదీ వరకు అవకాశం ఉంటుంది. నవంబర్‌ 20న పోలింగ్‌ నిర్వహిస్తారు. రెండు విడతల్లో పోలైన ఓట్లను నవంబర్‌ 23న లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో 81 నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 44 జనరల్‌ సీట్లు, 28 ఎస్టీ, 9 ఎస్సీ రిజర్వుడ్‌ సీట్లు ఉన్నాయి. జార్ఖండ్‌ 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు. మహారాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని మహయుతి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా, జార్ఖండ్‌ లో జేఎంఎం - కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. మాహారాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి నవంబర్‌ 26వ తేదీతో ముగుస్తుండగా, జార్ఖండ్‌ అసెంబ్లీ కాల పరిమితి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు ఉంది.


వయనాడ్‌, నాందేడ్‌ లోక్‌సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు లోక్‌ సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నామని సీఈసీ వెల్లడించారు. కేరళలోని వాయనాడ్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాహుల్‌ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వాయనాడ్‌ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయబోతున్నారు. ఆమె ఎన్నికల బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్‌ లోని బసిరిహాట్‌ లోక్‌సభ స్థానంపై కోర్టులో కేసు పెండింగ్‌ లో ఉన్నందున ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించలేదు. అసోంలోని ఐదు, బిహార్‌ లో నాలుగు ఛత్తీస్‌ గఢ్‌, గుజరాత్‌, మేఘాలయ అసెంబ్లీలో ఒక్కో స్థానం, కర్నాటకలో మూడు కేరళలో రెండు, పంజాబ్‌ లో నాలుగు, రాజస్థాన్‌ లో ఏడు, సిక్కింలో రెండు, ఉత్తర్‌ ప్రదేశ్‌ లో తొమ్మిది, ఉత్తరాఖండ్‌ లో ఒకటి, పశ్చిమ బెంగాల్‌ లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    
Advertisement

Similar News