మహాకుంభమేళా: రోజుకు సగటున 1.44 కోట్ల మంది పుణ్యస్నానాలు
ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానాలు ముగించుకున్న భక్తులు కాశీ, అయోధ్యకు వెళ్తున్నారన్న అధికారులు
మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది యాత్రికులు పోటెత్తుతున్నారు. రోజుకు సగటున 1.44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానాలు ముగించుకున్న భక్తులు కాశీ, అయోధ్యకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. భక్తుల తాకిడికి విపరీతంగా పెరగడంతో కాశీలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రయాగ్‌రాజ్‌వైపు వెళ్లే మార్గాలన్నీ రద్దీగా మారాయి. 200-300 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. గంటలకొద్దీ వాహనదారులు వాహనాల్లోనే ఉన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మరోవైపు రైళ్లలో సీట్లు దొరకకపోవడంతో ప్రయాణికులు లోకోపైలెట్లు ఉండే ప్రాంతాల్లో కూర్చునే యత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు అంచనా వేశారు.