మహాకుంభమేళా: 200-300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

రద్దీని నియంత్రించడానికి మధ్యప్రదేశ్‌లోనే వేలాది వాహనాలను నిలిపివేస్తున్న పోలీసులు

Advertisement
Update:2025-02-09 23:37 IST

మహాకుంభమేళాలో పాల్గొనడానికి కోట్లాదిమంది భక్తులు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సంబరం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా.. రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా సుమారు 200-300 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లే కనిపిస్తున్నాయి. రద్దీని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్‌లోనే వేలాది వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్లు సమాచారం.

గంటల పాటు ట్రాఫిక్‌లోనే

కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌రాజ్‌ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌-కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌-లఖ్‌నవూ-ప్రతాప్‌గఢ్‌,ప్రయాగ్‌రాజ్‌-వారణాసి-మిర్జాపూర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా వెళ్లే నేషనల్‌ హైవేల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతున్నది. 48 గంటలుగా ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నట్లు అనేకమంది ప్రయాణికులు పేర్కొంటున్నారు. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతున్నదని వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News