మాటలే కానీ కేజ్రీవాల్ దగ్గర చేతలు లేవు
కేజ్రీవాల్ తన వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేస్తుంటారని ఫైర్ అయిన హర్యానా సీఎం
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తన వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేస్తుంటారని ఆరోపించారు. తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. తమ అభివృద్ధి కోసం 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీకి పట్టం కట్టారు. ఢిల్లీ చరిత్రలోనే ఇదో చారిత్రాత్మక తీర్పు. కేజ్రీవాల్ పార్టీ తప్పుడు వాగ్దానాలతో ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించింది. యమునా నదిని శుభ్రం చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. స్వచ్ఛమైన నీటిని అందించలేకపోయారు. ప్రజల అభివృద్ధి కోసం మోడీ సర్కార్ తీసుకొచ్చిన పథకాలను అమలు చేయకుండా అడ్డుకున్నారంటూ కేజ్రీవాల్‌ను దుయ్యబట్టారు.
మాటలే కానీ కేజ్రీవాల్ దగ్గర చేతలు లేవు. తన వైఫల్యాలకు ఇతరులను బాధ్యుల్ని చేస్తుంటారు. 2025 నాటికి యమునా నదిని శుభ్రం చేయలేకపోతే.. ఓట్లు అడగనంటూ ఆయన గతంలో చెప్పారు. ఇప్పుడు చేసేది లేక హర్యానా ప్రభుత్వంపై నిందలు మోపారు. విషం కలిపారంటూ ఆరోపణలు చేశారు. ఆయన మోసాన్ని ప్రజలు అర్థం చేసుకుని బీజేపీకి అవకాశం కల్పించారని సైనీ వ్యాఖ్యానించారు.