కేసీఆర్ ని ఫాలో అయిన బీజేపీ సీఎం
మధ్యప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణపై ప్రతిపక్ష కాంగ్రెస్ కౌంటర్లిస్తోంది. పదవీకాలం ముగిసే సమయంలో, ప్రభుత్వం పడిపోయే దశలో మంత్రివర్గం విస్తరిస్తున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత కమల్ నాథ్. ఇది వీడ్కోలు సమయంలో పలికిన స్వాగత గీతం అన్నారు.
తెలంగాణతోపాటు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మరో రాష్ట్రం మధ్యప్రదేశ్. ఎన్నికలకు మరో మూడు నెలలే టైమ్ ఉంది. ఈ దశలో మధ్యప్రదేశ్ లో కూడా మంత్రి వర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి కేబినెట్ లో చోటిచ్చారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఈరోజు ఉదయం భోపాల్ లోని రాజ్‌భవన్ లో ముగ్గురు శాసనసభ్యులతో గవర్నర్ మంగూభాయ్ పటేల్, మంత్రులుగా ప్రమాణం చేయించారు. దీంతో మంత్రివర్గం బలం 31 నుంచి 34కి చేరింది.
తెలంగాణలో సీట్ల సర్దుబాటులో పార్టీకి నమ్మకంగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటిచ్చారు సీఎం కేసీఆర్. మూడు నెలల మంత్రి అంటూ సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు పేల్చినా.. రాజ్యాంగబద్ధంగా కేబినెట్ లో ఖాళీగా ఉన్న స్థానాన్నే సీఎం కేసీఆర్ భర్తీ చేశారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లో మూడు నెలల ముందు ఏకంగా మూడు బెర్త్ లు భర్తీ చేశారు.
రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధీకి కేబినెట్ లో తాజాగా చోటు కల్పించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. వింధ్య ప్రాంతంలో పార్టీ పరిరక్షణకోసం రాజేంద్ర శుక్లాకు అవకాశమిచ్చారు. మహాకోశల్ ప్రాంతంలో కాంగ్రెస్ ని గట్టిగా ఢీకొనేందుకు గౌరీశంకర్ బిసెన్ కు అవకాశమిచ్చారు. ఇక బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన రాహుల్ లోధీని కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు. ఈయన మాజీ సీఎం ఉమాభారతి మేనల్లుడు కావడం విశేషం. ప్రాంతాలు, కులాల సమతుల్యం కోసం ముగ్గుర్ని మంత్రి మండలిలోకి తీసుకున్నామని చెప్పారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
కాంగ్రెస్ సెటైర్లు..
మధ్యప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణపై ప్రతిపక్ష కాంగ్రెస్ కౌంటర్లిస్తోంది. పదవీకాలం ముగిసే సమయంలో, ప్రభుత్వం పడిపోయే దశలో మంత్రివర్గం విస్తరిస్తున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత కమల్ నాథ్. ఇది వీడ్కోలు సమయంలో పలికిన స్వాగత గీతం అన్నారు. మధ్యప్రదేశ్ లో మంత్రివర్గాన్ని మొత్తం మార్చేసినా బీజేపీ ఓడిపోవడం ఖాయం అని అన్నారు కమల్ నాథ్.