కొత్త సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్
రెండేళ్ల క్రితం బిపిన్ రావత్‌ను తొలి సీడీఎస్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన కొంత కాలం క్రితం ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన స్థానంలో అనిల్ చౌహాన్‌ను సీడీఎస్‌గా నియమించారు.
దేశానికి కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెప్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మన దేశానికి రెండవ సీడీఎస్‌గా వ్యవహరించనున్నారు. త్రివిద దళాలకు వేర్వేరుగా చీఫ్‌లు ఉన్నా.. అన్నింటికీ కలిపి ఒక హెడ్‌ను నియమించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం బిపిన్ రావత్‌ను తొలి సీడీఎస్‌గా నియమించింది. అయితే ఆయన కొంత కాలం క్రితం ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన స్థానంలో అనిల్ చౌహాన్‌ను సీడీఎస్‌గా నియమించారు. అనిల్ చౌహాన్ సీడీఎస్‌గా మాత్రమే కాకుండా.. సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేయనున్నారు.
బిపిన్ రావత్ రిటైర్మెంట్ తర్వాత సీడీఎస్‌గా పని చేశారు. అయితే ఇటీవల సీడీఎస్ నియామకానికి సంబంధించిన నిబంధనలకు కేంద్రం సవరించింది. లెఫ్టినెంట్ జనరల్ లేదా జనరల్.. దానికి సమానమైన హోదాలో పని చేస్తున్న లేదా రిటైర్ అయిన అధికారులను సీడీఎస్ స్థానం కోసం తీసుకునే వెసులుబాటు వచ్చింది. అయితే వారి వయస్సు మాత్రం 62 ఏళ్లకు మించరాదని పేర్కొన్నది. పైన పేర్కొన్న నిబంధనలు అనుసరించి అనిల్ చౌహాన్‌ను కొత్త సీడీఎస్‌గా నియమించారు.
1961 మే 18న ఉత్తరాఖండ్‌లో జన్మించిన అనిల్ చౌహాన్.. ఖడాక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందారు. 1981లో 11వ గూర్ఖా రైఫిల్స్ నుంచి ఇండియన్ ఆర్మీలో నియమించబడ్డారు. మేజర్ జనరల్ హోదాలో బారాముల్లా సెక్టార్‌లో పని చేశారు. 2019 నుంచి ఈస్టర్న్ కమాండ్‌కి కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. 2021లో రిటైర్ అయ్యారు. ఐక్యరాజ్య సమితితో పాటు, సైన్యానికి సంబంధించిన ముఖ్యమైన నియామకాల్లో ఆయన పాత్ర ఉంది.